పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా పశ్చిమ బంగాలో చెలరేగిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిరసనకారులు ప్రధాన రోడ్లు, రైలు మార్గాలను నిర్బంధించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు ఆందోళనల్లో పాల్గొన్న కారణంగా రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
జాతీయ రహదారులు నిర్బంధం..
రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు ఆందోళనల్లో పాల్గొన్నారు. ముర్షిదాబాద్‌లో ఉత్తర, దక్షిణ బంగాల్‌ను కలిపే ప్రధాన జాతీయ రహదారి 34ను, హౌరా జిల్లా దోంజుర్ ప్రాంతంలో ఆరో నంబరు జాతీయ రహదారిని నిర్బంధించారు. పలు వాహనాలను ధ్వంసం చేశారు. టైర్లకు నిప్పుపెట్టి నిరసన తెలిపారు.
రైళ్లకు అంతరాయం...
సీల్డా-హస్నాబాద్ మధ్య నడిచే రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగించారు నిరసనకారులు. శోందాలియా, కాక్ర మిర్జాపుర్ స్టేషన్ల పరిధిలోని రైల్వే పట్టాలపై ఉదయం 6.25 ప్రాంతంలోనే బైఠాయించినట్లు అధికారులు తెలిపారు. ఈ మార్గంలో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు వెల్లడించారు.
భారీగా పోలీసుల మోహరింపు..
ఆందోళనలను అదుపు చేసేందుకు భారీగా బలగాలను మోహరించారు అధికారులు. ఎక్కడికక్కడ నిరసనకారులను అదుపులోకి తీసుకుని పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు చేపట్టారు.
21న బిహార్ బంద్‌కు పిలుపు...
పౌరసత్వ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఈనెల 21న బిహార్ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది లాలూ ప్రసాద్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ). పౌర చట్టం రాజ్యాంగాన్ని దెబ్బతీసేలా ఉందని ఆరోపించింది. రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్న రాజకీయ, రాజకీయేతరులంతా ఈ బంద్‌లో పాల్గొనాలని కోరారు తేజస్వీ యాదవ్.
ఇదీ చూడండి: పౌర'చట్టానికి వ్యతిరేకంగా నాగాలాండ్ బంద్