హైదరాబాద్ షాద్నగర్లో డాక్టర్ ప్రియాంకపై జరిగిన అత్యాచార ఘటనతో యావత్ దేశం ఉలిక్కిపడింది. ఇంకెన్నాళ్లు ఈ మృగాళ్ల అరాచకాలు అంటూ ప్రశ్నిస్తోంది మహిళా లోకం. ప్రియాంక ఘటనపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పార్లమెంటు ముందు నిరసనకు దిగిన 23 ఏళ్ల అను దుబేను.. దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మౌనంగా నిరసన చేపట్టిన ఆమెపై పోలీసులు జులుం ప్రదర్శించారని విద్యార్థులు, ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి.
" ఒక యువతి ఇంటికి వెళ్తుంటే ఆమెపై సామూహిక అత్యాచారం చేసి పూర్తిగా దహనం చేశారు. అందుకే దిల్లీలోని.. అను దుబేకు ఈ విషయంపై కోపం వచ్చింది. దేశం మొత్తం ఉద్రేకంతో ఊగిపోతోంది. అను కేవలం పార్లమెంట్ ముందు ఒక బోర్డు పట్టుకుని నిల్చుంది. మహిళలపై ఈ అరాచకాలు ఇంకెన్నాళ్లు అని అడిగింది. ఇందుకోసం పోలీసులు లాక్కెళ్లి పోలీస్ స్టేషన్లో పడేశారు. ఆమె మౌనంగా నిరసిస్తున్నప్పుడు దిల్లీ పోలీసులు సహకరించాల్సింది పోయి దౌర్జన్యం చేస్తారా?"
-స్వాతి మాలివాల్, సామాజికవేత్త
అను దుబేను వెంటనే విడుదల చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. నిరసన చేపట్టిన వారిని బెదిరించి బంధించడం కాదు... నిందితులను వెంటనే శిక్షించాలన్నారు. అప్పుడే దేశంలో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: బల పరీక్షలో 'మహా వికాస్ అఘాడీ' విజయం