కరోనా విజృంభిస్తున్న వేళ.. కిరాణా సామాన్ల ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా చూసేందుకు రోపార్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) పరిశోధకులు ఒక వినూత్న సాధనాన్ని అభివృద్ధి చేశారు. ఇది అతినీలలోహిత కిరణాల సాయంతో సదరు వస్తువులను క్రిమిరహితంగా మారుస్తుంది. దీన్ని ఇంటి వాకిలి వద్ద పెట్టుకొని.. వెలుపలి నుంచి తెచ్చే వస్తువులను శుద్ధి చేసుకోవచ్చని పరిశోధకులు తెలిపారు. దీని ధర రూ.500 కన్నా తక్కువేనని పేర్కొన్నారు.
వస్తువులను ఇది అర గంటలోనే క్రిమిరహితంగా మారుస్తుందని చెప్పారు. అనంతరం వాటిని ఉపయోగించడానికి 10 నిమిషాల పాటు నిరీక్షించాల్సి ఉంటుందని తెలిపారు. చూడటానికి ఈ సాధనం ఒక ఇనుప పెట్టెలా ఉంటుంది. ఇందులో కూరగాయలు, పాల ప్యాకెట్లు, చేతి గడియారాలు, పర్సులు, మొబైల్ ఫోన్లు వంటి వాటిని ఉంచొచ్చు. నీటి శుద్ధి యంత్రాల్లో వాడే అతినీలలోహిత క్రిమిసంహారక ఇరాడియేషన్ పరిజ్ఞానాన్ని ఇందులో ఉపయోగించారు.