బోఫోర్స్ కుంభకోణం కేసు దర్యాప్తు కొనసాగుతుందని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) స్పష్టం చేసింది. ఈ కేసులో లోతుగా విచారణ చేయడానికి అనుమతి కోరుతూ దిల్లీ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో సీబీఐ దరఖాస్తు చేసి, అనంతరం ఉపసంహరించుకుంది. ఈ విషయంపై స్పష్టతనిచ్చింది సీబీఐ.
"బోఫోర్స్ కుంభకోణానికి సంబంధించి, నిందితుడు మైఖేల్ హర్ష్‌మన్ కొన్ని వివరాలు వెల్లడించిన దృష్ట్యా, మరింత లోతుగా విచారించేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా న్యాయస్థానాన్ని సీబీఐ కోరింది."-నితిన్ వాకంకర్, సీబీఐ అధికార ప్రతినిధి
ఈ కేసుపై స్వతంత్రంగా దర్యాప్తు చేపట్టడానికి సీబీఐకి హక్కులు, అధికారాలు ఉన్నాయని న్యాయస్థానం స్పష్టం చేసిందని నితిన్ తెలిపారు. ఇకపైనా ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతుందన్నారు.
"చట్టపరమైన అభిప్రాయాలను పొందిన తరువాత, దిల్లీ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టుకు 2019 మే 16న సీబీఐ దరఖాస్తు చేసుకుంది. అందులో సీఆర్పీసీ సెక్షన్ 173(8) ప్రకారం బోఫోర్స్ కుంభకోణంపై మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి అనుమతి ఇవ్వాలని సీబీఐ కోరింది. నిజానికి సీబీఐకి న్యాయస్థానం అనుమతి అవసరం లేదు. విషయాన్ని కోర్టుకు నివేదిస్తే సరిపోతుంది."-నితిన్ వాకంకర్, సీబీఐ అధికార ప్రతినిధి
ఇదీ కేసు....
స్వీడిష్ ఆర్టిలరీ తుపాకుల కొనుగోలు ఒప్పందంలో రూ.64 కోట్లు ముడుపులు చేతులు మారాయన్నదే బోఫోర్స్ కుంభకోణం కేసు.
ఇదీ చూడండి: 'మోదీలై': ప్రధానిపై రాహుల్ కొత్త పంచ్‌లు