కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని ఉత్తరప్రదేశ్ పోలీసులు అడ్డుకున్న ఆందోళనలు విరమించలేదు. సోన్‌భద్ర ఘటనకు వ్యతిరేకంగా ఉదయం రోడ్డుపై బైఠాయించిన ప్రియాంకను అదుపులోకి తీసుకుని చునార్ అతిథి గృహానికి తరలించారు. అక్కడ కూడా ధర్నాను కొనసాగిస్తున్నారు ప్రియాంక.
పలు రాష్ట్రాల్లో నిరసనలు
ప్రియాంక గాంధీని అదుపులోకి తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పలు రాష్ట్రాల్లో యూపీ ప్రభుత్వ చర్యకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నేతలు నిరసనలు చేపట్టారు. ఉత్తరప్రదేశ్, జమ్ము కశ్మీర్, బంగాల్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. దిల్లీలోని భాజపా ప్రధాన కార్యాలయం ఎదుట హస్తం కార్యకర్తలు ధర్నాకు దిగారు.
సోన్‌భద్ర భూవివాదం
సోన్‌భద్ర భూ వివాదంలో ఘోరావల్ వద్ద ఈ బుధవారం రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఘటనలో ఒక వర్గానికి చెందిన వారు మరొక వర్గంపై కాల్పులు జరిపారు. ఫలితంగా 10 మంది చనిపోయారు. మరో 18 మంది గాయాలపాలయ్యారు.
ఘటనలో గాయపడి వారణాసిలోని బీహెచ్యు ట్రామా సెంటర్లో చికిత్స పొందుతున్న వారిని ప్రియాంక పరామర్శించారు. అనంతరం సోన్‌భద్రలోని మృతుల కుటుంబాలను కలిసేందుకు వెళుతుండగా నారాయణ్‌పుర్ సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. అధికారుల తీరును నిరసిస్తూ పార్టీ కార్యకర్తలు, నేతలతో కలిసి రోడ్డుపై బైఠాయించారు ప్రియాంక.
ఇదీ చూడండి: ప్రియాంకను అడ్డుకున్న పోలీసులు.. రాహుల్ ఆగ్రహం