సముద్ర మట్టానికి 10 వేల అడుగుల ఎత్తులో ప్రపంచంలోనే పొడవైన రహదారి టన్నెల్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. శనివారమే రోహ్‌తంగ్‌లో ఈ టన్నెల్‌ను ప్రారంభించనున్నారు.
అయితే.. సొరంగ మార్గం ప్రారంభానికి ముందు అక్కడి సిబ్బందికి కరోనా సోకడం ఆందోళన కలిగిస్తోంది. టన్నెల్ ప్రారంభోత్సవం ఏర్పాట్లు చేసేందుకు వచ్చిన ప్రభుత్వ ఉద్యోగుల్లో 17 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. ఇందులో పోలీసులు, పర్యటక శాఖ ఉద్యోగులు, పీఎంఓ కార్యాలయ డ్రైవర్లు ఉన్నారు. ప్రొటోకాల్ ప్రకారం ప్రధాని కార్యక్రమంలో పాల్గొనే ప్రతిఒక్కరికీ కొవిడ్ పరీక్షలు చేస్తున్నారు.
ఇదీ చూడండి: మరో కీలక టన్నెల్ నిర్మాణంపై కేంద్రం దృష్టి!
హిమాలయ పర్వత సానువుల్లో నిర్మించిన ప్రపంచంలోనే అతి పెద్ద సొరంగ మార్గమిది. ప్రారంభోత్సవం కోసం హిమాచల్ ప్రదేశ్‌లోని రోహ్‌తంగ్‌లో అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రారంభానంతరం.. బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తారు. వ్యూహాత్మక ప్రయోజనాలున్న ఈ సొరంగంతో మనాలి, లేహ్ మధ్య దూరం 46 కిలోమీటర్లు తగ్గడంతో పాటు 4- 5 గంటల ప్రయాణ సమయం ఆదా అవుతుంది. 9.02 కిలోమీటర్ల ఈ సొరంగ మార్గానికి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ పేరు పెట్టారు. అన్నిరకాల వాతావరణ పరిస్థితుల్ని తట్టుకొనేలా, 80 కిలోమీటర్ల వేగంతో వాహనాలు ప్రయాణించేలా అత్యాధునిక సాంకేతికతతో ఈ సొరంగాన్ని నిర్మించినట్టు ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది.
ప్రధాని పర్యటనకు ముందురోజు శుక్రవారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మనాలిలో పర్యటించనున్నారు. మనాలి- లేహ్ మార్గంలో నిర్మించిన 3 కీలక వంతెనలను ఆయన ప్రారంభిస్తారు.