మూడు దేశాల పర్యటనలో భాగంగా స్విట్జర్లాండ్లో పర్యటిస్తున్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అక్కడ మహాత్మగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. గాంధీజీ 150వ జయంత్యుత్సవాల సందర్భంగా విల్లేన్యూవేలో ఈ కార్యక్రమం ఏర్పాటుచేశారు.
విల్లేన్యూవేతో గాంధీజీకి ప్రత్యేక అనుబంధం ఉందని గుర్తుచేశారు రామ్నాథ్ కోవింద్.
''గాంధీజీ భారత్లో తొలి ఆశ్రమాన్ని సబర్మతి నది ఒడ్డున ఏర్పాటు చేశారు. ఇప్పుడు.. ఆయనను జెనీవా నది ఒడ్డుకు తీసుకొచ్చాం. ప్రకృతిని అమితంగా ప్రేమించే గాంధీకి.. స్విట్జర్లాండ్ వాసులు తమ హృదయాల్లో ప్రత్యేక స్థానం కల్పించారు.''
- రామ్నాథ్ కోవింద్, భారత రాష్ట్రపతి
మహాత్ముడు ఎందరికో మార్గదర్శకంగా నిలిచారని... వాతావరణ మార్పు సమస్యను ఎదుర్కొనేందుకు, పర్యావరణ పరిరక్షణకు ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకోవాలని సూచించారు రాష్ట్రపతి.
నోబెల్ పురస్కార గ్రహీత రోమైన్ రోలాండ్ ఆహ్వానం మేరకు 1931లో గాంధీజీ విల్లేన్యూవేలో పర్యటించిన విషయాన్ని ఈ సందర్భంగా కోవింద్ జ్ఞప్తికి తెచ్చుకున్నారు.