రాష్ట్రపతి భవన్లో భారతరత్న అవార్డుల ప్రధానోత్సవం వైభవంగా జరిగింది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా భారతరత్న పురస్కారాన్ని అందుకున్నారు. ఈ పురస్కారాన్ని పొందిన ఐదో రాష్ట్రపతిగా ఆయన నిలిచారు.
దివంగత గాయకుడు భూపేన్ హజారికా తరపున ఆయన తనయుడు తేజ్.. దేశ అత్యున్నత పౌరపురస్కారాన్ని అందుకున్నారు.
దివంగత భారతీయ జనసంఘ్ నేత, సరస్వతి శిశుమందిర్ వ్యవస్థాపకుడు నానాజీ దేశ్‌ముఖ్ తరపున వీరేంద్రసింగ్ పురస్కారాన్ని స్వీకరించారు. హజారికా, దేశ్‌ముఖ్‌లకు వారి మరణానంతరం ఈ పురస్కారాలను భారత ప్రభుత్వం ప్రకటించింది.
రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్‌హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, పలువురు కేంద్రమంత్రులు, ప్రముఖులు హాజరయ్యారు. 2015 తరువాత భారతరత్న పురస్కారాలు ప్రదానం చేయడం ఇదే మొదటిసారి.
భారతరత్నాల విశేషాలు
ప్రణబ్ ముఖర్జీ :
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 'ప్రణబ్ దా'గా ప్రసిద్ధులు. ఐదు దశాబ్దాలపాటు రాజకీయ రంగంలో సేవలు అందించారు.
* 2012-2017 వరకు దేశ 13వ రాష్ట్రపతిగా సేవలందించారు.
* ఇందిరాగాంధీ నుంచి మన్మోహన్ వరకు అందరి మంత్రివర్గాల్లోనూ పనిచేశారు.
* ఆర్థిక, విదేశాంగ, రక్షణశాఖ మంత్రిగానూ సేవలందించారు.
*కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. పార్టీని అనేక సంక్షోభాల నుంచి గట్టెక్కించి అపర చాణక్యుడిగా కీర్తిపొందారు.
* ప్రపంచంలోనే అత్యుత్తమ ఆర్థికమంత్రిగా ఎంపికయ్యారు.
భూపేన్ హజారికా
* భూపేన్ హజారికా ప్రముఖ సంగీత విద్యాంసులు. బహుముఖ రంగాల్లో సేవలందించారు.
* సంగీతకారునిగా, కవిగా, గాయకుడిగా, రచయితగా పనిచేశారు. వేయికి పైగా పాటలు రాశారు.
* ఈయన పాటలు పలు భాషల్లోకి అనువాదమయ్యాయి.
* కథలు, ప్రయాణాలు, పిల్లల పద్యాల పుస్తకాలూ రచించారు.
* దర్శక, నిర్మాతగా, పాత్రికేయుడిగానూ పనిచేశారు.
* ఈశాన్య భారతానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు.
నానాజీ దేశ్‌ముఖ్
సరస్వతి శిశుమందిర్ స్థాపించారు. పేదల స్థితిగతులు మెరుగుపర్చేందుకు నిర్విరామ కృషి చేశారు. సామాజిక కార్యకర్తగా దేశానికి ఎనలేని సేవ చేశారు. విద్య, ఆరోగ్యం, గ్రామీణ స్వయం సమృద్ధికి విశేష కృషి చేశారు. రాజకీయ రంగంలోని రాణించారు.
ఇదీ చూడండి: కశ్మీర్ ఎఫెక్ట్: సంఝౌతాపై రగడ-భిన్న ప్రకటనలు