బిహార్‌లో ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్‌పై విమర్శలు వెల్లువెత్తున్నాయి. మెదడువాపు వ్యాధితో చిన్నారులు మృత్యువాత పడుతున్నప్పటికీ.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఫలితంగా.. తేజస్వీపై వ్యతిరేకతను వినూత్నంగా వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ముజఫర్‌పుర్‌లో తేజస్వీ ఆచూకీ చెప్పిన వారికి రూ.5100 రివార్డు ప్రకటించినట్లు తెలిపే పోస్టర్ ప్రస్తుతం కలకలం రేపుతోంది.
బిహార్‌లో ఇటీవల మెదడువాపు వ్యాధితో దాదాపు వంద మందికి పైగా చిన్నారులు మృతి చెందారు. ప్రధాన ప్రతిపక్షనేతగా ఉన్న తేజస్వీ యాదవ్... ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన సమయంలో విదేశాలకు వెళ్లిన కారణంగా ఆయనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ తరుణంలో ఇలాంటి పోస్టర్లు దర్శనమివ్వడం చర్చనీయాంశంగా మారింది.
తేజస్వీ ఆచూకీపై తలోమాట..
తేజస్వీ యాదవ్ ఎక్కడున్నారో ఇప్పటికీ ఆ పార్టీ నేతలకు తెలియక పోవడం గమనార్హం. క్రికెట్ మ్యాచ్‌లు చూసేందుకు లండన్ వెళ్లారని కొందరంటుంటే.. వ్యక్తిగత పని మీద ఆస్ట్రేలియా వెళ్లారు అని ఇంకొందరు నాయకులు చెబుతున్నారు. రాష్ట్రంలో అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రతిపక్షనేతగా ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన బాధ్యతను విస్మరిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఇదీ చూడండి: యోగాపై రాహుల్ ట్వీట్... సర్వత్రా విమర్శలు