శనివారం నుంచి కశ్మీర్ లోయలో మొబైల్ ఫోన్ సేవలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ముందుగా పోస్ట్‌పెయిడ్ సేవలను పునరుద్ధరించనున్నట్లు అధికారులు తెలిపారు.
కశ్మీర్‌లోయలో ఉన్న 68 లక్షల మొబైల్ వినియోగదారులలో 40 లక్షల మంది పోస్ట్ పెయిడ్ కస్టమర్లే ఉన్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ముందుగా పోస్ట్ పెయిడ్ సేవలను పునరుద్ధరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అనంతరం ప్రీపెయిడ్ సేవలను తిరిగి ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే అంతర్జాల సేవల కోసం ఇంకా కొన్ని రోజులు వేచి చూసే పరిస్థితి నెలకొంది.
పర్యటకం కోసమే!
కేంద్ర ప్రభుత్వం కశ్మీర్ లోయకు పర్యటకులను అనుమతించిన నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ట్రావెల్ అసోసియేషన్ సభ్యులు సంబంధిత ప్రభుత్వ అధికారులను కలిశారు. టెలిఫోన్ సిగ్నల్స్ లేకుంటే పర్యటకులు రావడానికి మొగ్గు చూపరని అధికారులకు విన్నవించారు.
ఆగస్టు 5న కేంద్రం ఆర్టికల్-370 రద్దు చేసినప్పటినుంచి కశ్మీర్లో మొబైల్, అంతర్జాల సేవలు నిలిపివేశారు. ఆగస్టు 17న పాక్షికంగా టెలిఫోన్ సేవలు పునరుద్ధరించారు. సెప్టెంబర్ 4 నుంచి ల్యాండ్‌ఫోన్ సేవలను తిరిగి ప్రారంభించారు.