వారు యాత్రికులు కాదు.. పర్యటకులు కాదు.. ఎన్నో ఏళ్లుగా అక్కడ వ్యాపారం చేస్తూ.. పొట్ట నింపుకుంటున్న సామాన్యులు.. వ్యాపారులు.
ఎప్పుడు తూటాల చప్పుడు వినపడుతుందో ?.. ఎప్పుడు ఏం జరుగుతుందో..? ఎవరి కళ్లలో చూసినా ఇదే అనుమానం, భయం. లయ మారిన పాదాల చప్పుళ్లలో.. చకచకా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలన్న తొందర! ఇది కశ్మీరులో తాజా పరిస్థితి.
'కశ్మీరు నుంచి యాత్రికులు, పర్యటకులు తక్షణమే కశ్మీరు లోయను విడిచిపెట్టి వెళ్లిపోవాలి'... ఇది భారత ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఇచ్చిన ఆదేశం.
ఇతర రాష్ట్రాల విద్యార్థులు, యాత్రికులు ఇప్పటికే ఇంటిముఖం పట్టారు. కానీ ఎప్పటినుంచో వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న కశ్మీరేతర వ్యాపారులు మాత్రం ఏం జరిగినా.. ఆ రాష్ట్రాన్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదంటున్నారు. అక్కడి వ్యాపారుల్లో ఎవరిని కదిలించినా... ఇదే సమాధానం.
"ప్రజలు చాలా భయపడుతున్నారు. స్థానికేతరులను వెళ్లిపోమంటున్నారు. యాత్రికులను వెళ్లిపోవాలంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే మాకేం అర్థం కావట్లేదు. ఇక్కడ నుంచి వెళ్లిపోండని మోదీ సర్కారు చెబుతోంది. మేం ఎలా వెళ్తాం? 24 గంటల్లో మేం ఎలా వెళ్తాం? ఇక్కడ మేం 27 ఏళ్లుగా ఉంటున్నాం. మా పిల్లలు ఇక్కడే చదువుకుంటున్నారు. మా వ్యాపారాలు ఇక్కడే నడుస్తున్నాయి. మరి మేం ఎలా వెళ్తాం.?"
- వ్యాపారి
ఒకవైపు సర్కారు ఆదేశాలతో తలలు పట్టుకున్న వ్యాపారులకు.. సామాజిక మాధ్యమాల్లో వినిపిస్తోన్న వదంతులు మరింత గుబులు పుట్టిస్తున్నాయి. స్థానికేతరులు త్వరగా వచ్చేయండి వంటి సందేశాలు షికార్లు చేస్తున్నాయి.
"ఇక్కడ నాది దర్జీ దుకాణం. ఇక్కడ నా వ్యాపారం సాఫీగా సాగుతోంది. అంతర్జాలం, ఫేస్బుక్, ఫోన్లలో చూస్తున్నాం. స్థానికేతరులు కశ్మీరు నుంచి వచ్చేయండి. 24 గంటల్లో వచ్చేయండి. ఇంకా 44 గంటలే ఉంది అంటున్నారు. ఈ వార్తలు ఎవరు సృష్టిస్తున్నారో, ఎందుకు అంటున్నారో తెలియదు. మేము ఇక్కడకు సుఖంగా.. రోజూ నాలుగు మెతుకులు తినేందుకు వచ్చాం. వెనక్కు వెళ్లే ఆలోచనే లేదు. ఇక్కడ వ్యాపారం బాగా నడుస్తోంది.. ఇకపైనా నడవాలి".
- మహ్మద్ జంషీద్, దర్జీ