ఎన్నికల్లో పార్టీల నుదుటిరాత రాసేది ఓటరు విధాతలే అయినా, వారితో ఏ మాత్రం నిమిత్తం లేకుండా ప్రత్యర్థి పక్షానికి దక్కిన బారెడు మెజారిటీనీ మూరెడుకు కుదించేసి నిక్షేపంగా అధికార పీఠాలకు ఎగబాకడంలో రాటుతేలిపోయాయి ఫిరాయింపు రాజకీయాలు! దశాబ్దాల తరబడి జాతి జీవన స్రవంతికి దూరంగా ఈశాన్య రాష్ట్రాలు ఈసురోమంటున్నాయన్న వెర్రిభ్రమల్ని పటాపంచలు చేసి, ఫిరాయింపుల్లో కొత్త చరిత్ర లిఖిస్తున్న అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ లాంటి మణిపూసల్ని చూస్తే- నోరు వెళ్లబెట్టాల్సిందే. గవర్నర్లు, సభాపతుల వంటి రాజ్యాంగ పదవుల దన్నుతో సిసలైన ప్రజాస్వామ్యానికి వెన్నుపోట్లతో ఈశాన్యంలో రికార్డుల పరంపరను తిలకించి తన్మయత్వం చెందాల్సిందే!
ప్రజాస్వామ్యం ఓ భ్రాంతి!
‘ప్రజల వలన ప్రజల చేత ప్రజల కొరకు’ అంటున్న ప్రజాస్వామ్యంలో ఆయా పార్టీ ప్రభుత్వాల సృష్టి స్థితి లయకారకులు ప్రజలేనన్నది వట్టి భ్రమ. ఓటు వేయడంతో పౌరుల బాధ్యత తీరిపోగా, ఎన్నికల ఫలితాల ప్రకటనలతో ఈసీ రాజ్యాంగబద్ధ విధి ఓ కొలిక్కి రాగా, మెజారిటీ సీట్లు సాధించిన పార్టీయే అధికారం చేపడుతుందా అన్నదే ప్రశ్నార్థకంగా మారుతోంది. 2017 మార్చి నాటి ఎన్నికల్లో మొత్తం 60 సీట్ల మణిపూర్ అసెంబ్లీలో 28 సీట్లు సాధించి కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా నిలిచింది. నాలుగు స్థానాలు గెలిచిన నేషనల్ పీపుల్స్ పార్టీ మద్దతు తనకుందంటూ అప్పటికే ముమ్మార్లు ముఖ్యమంత్రిగా చక్రం తిప్పిన ఇబోబి సింగ్ గవర్నర్ నజ్మాహెప్తుల్లాను కలిసి విన్నవించినా ఫలితం లేకపోయింది. రాజీనామా చేయాలన్న గవర్నర్ ఆదేశంతో ఇబోబి నిష్క్రమించగా, చిన్నాచితకా పార్టీలన్నీ ఎన్‌సీపీ సహా- 21 సీట్లు గెలిచిన కమలనాథుల పక్షాన మోహరించాయి. కాంగ్రెస్ పక్షాన గెలిచిన శ్యామ్‌కుమార్ సింగ్ పార్టీ ఫిరాయించి, నిక్షేపంగా మంత్రిపదవిలో కుదురుకున్నాడు. అతగాడిని అనర్హుడిగా ప్రకటించాలంటూ ఏకంగా 13 పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై నిర్ణయం తీసుకోవాల్సిన సభాపతి- అవసర సమయంలో ఆదుకొన్న ఆప్తుణ్ని అధికార పక్షం ఇష్టాయిష్టాలకు భిన్నంగా సాగనంపలేరు కాబట్టి, ఎటూ తేల్చకుండా కాలయాపన చెయ్యడమే అత్యుత్తమ మార్గమని త్రికరణశుద్ధిగా విశ్వసించారు!
చెంప చెళ్లుమనేలా?
ఈ రాజకీయ పితలాటకం అప్పీళ్ల రూపేణా సుప్రీంకోర్టుకు చేరినప్పుడు- మొన్న జనవరి మూడోవారంలో న్యాయపాలిక స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. మాన్య సభ్యుల అర్హతానర్హతల నిర్ధారణ సభాపతి పరిధిలోని అంశమే అయినా, ఆ బాధ్యతా నిర్వహణలో ఆయన విఫలమైనప్పుడు న్యాయస్థానం జోక్యం చేసుకోగల వీలుందంటూ- నెల రోజుల్లోగా నిర్ణయం వెలువరించాలని ఉత్తర్వులు జారీచేసింది. ఆ గడువు దాటాకే మరో ఎనిమిది వారాల సమయం కావాలంటూ స్పీకరు తరఫున విజ్ఞాపన ‘సుప్రీం’ సముఖానికి చేరింది. అలా లాభం లేదు... కోర్టే నిర్ణయం ప్రకటించాలంటూ వాదనలు సాగినా, సంయమనం పాటించిన న్యాయపాలిక- మార్చి 14లోగా తుదినిర్ణయం ఖరారవుతుందన్న సభాపతి మాటనే మన్నించింది. అదీ దాటిపోగా మరో పది రోజుల గడువు అవసరపడుతోందన్న నేపథ్యంలో- రాజ్యాంగంలోని 142 అధికరణ అనుసారం విశిష్టాధికారాల్ని వినియోగించి, తదుపరి ఆదేశాలు వెలువడేదాకా శ్యామ్‌కుమార్ సింగ్ అసెంబ్లీకి హాజరుకారాదని అనుశాసించింది. దాంతోపాటే, అమాత్యగిరీనీ ఊడబెరికింది! స్వేచ్ఛావిపణి రాజకీయాల్లో ఫిరాయింపుల పల్లకీలో ఊరేగుతూ, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న దుర్వినీత ధోరణులకు తోక కోసి సున్నం పెట్టేటంత ప్రభావాన్విత తీర్పు ఇది!
బొడ్డుపేగు 'రా'బంధం!
త్రిశంకు సభ ఏర్పడిందంటే చాలు, ఉద్ధృతంగా పోటెత్తుతాయి రాజకీయ బేరసారాలు! ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీని ఆహ్వానించాలన్నదానిపై తగు మార్గదర్శకాలున్నా- ‘పై నుంచి’ మార్గనిర్దేశాలే గవర్నర్లకు శిరోధార్యాలు కావడంతో సర్కారీ సృష్టికర్తలు వారే అవుతున్నారు. ఫిరాయింపులపై నిర్ణయాధికారాన్ని పదో షెడ్యూలులోని చట్టం సభాపతులకే కట్టబెట్టడంతో- ప్రభుత్వాల మనుగడ(స్థితి)కు వారే ఆధారశిలగా మారుతున్నారు. ఈ అప్రజాస్వామిక పోకడలను లయం చేసే రాజ్యాంగబద్ధ చొరవకు పార్టీలు సమకట్టే అవకాశమే లేని వాతావరణంలో- ప్రజలెన్నుకొన్న ప్రభుత్వం అన్న భావనే మసకేసిపోతున్నదిప్పుడు! అధికార పక్షంతో సభాపతికి ఉండే బొడ్డుపేగు రాజకీయ బంధం- బంతిలో వలపక్షానికి కారణమవుతోంది. అదే ప్రజాస్వామ్యస్ఫూర్తికి శరాఘాతంగా మారుతోంది. దానికి విరుగుడు మంత్రం ఏదో కనిపెట్టాల్సిన సమయం ఆసన్నమైంది!
కనకపు సింహాసనమున...!
‘సభా స్వాతంత్య్రానికి దాని ఔన్నత్యానికి ప్రాతినిధ్యం వహించే సభాపతి స్థానం ఎంతో విలువైనది... ఎల్లప్పుడూ పక్షపాత రహితులైన ప్రతిభావంతులే ఆ స్థానాన్ని అధిష్ఠించా’లని 1948లోనే తొలి ప్రధాని పండిత నెహ్రూ అభిలషించారు. స్వాతంత్య్రానికి ముందు బ్రిటిష్ దిగువ సభ (హౌస్ ఆఫ్ కామన్స్) సంప్రదాయాలే ఇక్కడా అమలులో ఉండేవి. హౌస్ ఆఫ్ కామన్స్‌కు స్పీకర్‌గా ఎన్నికైన వ్యక్తి అంతవరకు తాను ప్రాతినిధ్యం వహించిన పార్టీతో తెగతెంపులు చేసుకోవడం అక్కడి పద్ధతి. దానికి కట్టుబాటు చాటుతూ 1925లో ఆ ఉన్నతస్థానానికి ఎంపికైన విఠల్‌భాయ్ పటేల్ స్వరాజ్ పార్టీ సభ్యత్వాన్ని వదులుకొన్నారు. తొలి సార్వత్రిక ఎన్నికలకు ముందు త్రివేండ్రంలో జరిగిన ప్రిసైడింగ్ ఆఫీసర్ల సదస్సు- మరోసారి ఎన్నిక కాదలచిన స్పీకర్‌పై ఎవరూ పోటీ అభ్యర్థుల్ని నిలబెట్టరాదని, పార్టీ రాజకీయాల్లో స్పీకర్లు పాల్పంచుకోరాదని తీర్మానించింది. 1967నాటి ప్రిసైడింగ్ ఆఫీసర్ల సదస్సు ఏర్పాటు చేసిన వీఎస్ పేజ్ కమిటీ- పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి సభాపతుల నిష్పాక్షికత కీలకమైనందున, తాము ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీతో స్పీకర్లు అన్ని బంధాలూ తెంచుకోవాలని సూచించింది. ఆ సిఫార్సును మన్నించి లోక్‌సభాపతిగా ఎన్నికయ్యాక కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసింది నీలం సంజీవరెడ్డి ఒక్కరే. నేడు ఆ సమున్నత ప్రమాణాలు ఏ గంగలో కలిశాయని ఆరా తీయబోతే కలిగేది నిర్వేదమే!
ఇది జరిగేనా?
ఫిరాయింపుదారులతో జట్టుకట్టి 1993లో గోవా శాసనసభాపతి తానే ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించడం- నాటి రాజకీయ వింత. మరో పదేళ్లకు ఝార్ఖండ్‌లో నాటి ముఖ్యమంత్రి మరాండీకి పొగపెట్టి సీఎం పీఠం కోసం సభాపతిగా నామ్‌ధారి నడిపింది అసలు సిసలు పొలిటికల్ సంత. సంకుచిత రాజకీయ కాంక్షలతో సభాపతి స్థానాలు ఇంతగా భ్రష్టుపట్టిన వేళ- అన్ని పక్షాలూ సరైన దిద్దుబాట్లకు కూడివస్తేనే ప్రజాస్వామ్యానికి మనుగడ! ఫిరాయింపులపై ఫిర్యాదుల్ని స్పీకర్లు మూడు నెలల్లో తేల్చేయాలని సుప్రీంకోర్టు మరో మన్నికైన సూచనా చేసింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి లేదా హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో శాశ్వత ట్రైబ్యునల్ లేదా మరేదైనా స్వతంత్ర వ్యవస్థ ఏర్పాటుకు రాజ్యాంగ సవరణ అంశాన్ని పరిశీలించాలని అది పార్లమెంటుకు మొన్న జనవరిలో సూచించింది. అడ్డగోలుగా అధికారాన్ని కైవసం చేసుకొనే దొడ్డిదారుల్ని మూసేయడానికి ఏ పాలక పక్షాలు సిద్ధపడతాయి? విపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే పార్టీలు ఫిరాయింపులపై గగ్గోలు పెడతాయి. ఫిరాయింపుదారులెవరైనా ఆరేళ్లు అన్ని ప్రభుత్వ పదవులకూ అనర్హులని ప్రకటించి, ఫిరాయింపులపై తుదినిర్ణయ బాధ్యతను ‘సుప్రీం’ సూచించినట్లుగా స్వతంత్ర సంస్థకు కట్టబెట్టినప్పుడే రాజకీయ రంకులరాట్నం ఆగేది; దేశం ప్రజాస్వామ్య పథంలో సాగేది!
- పర్వతం మూర్తి
ఇదీ చూడండి: ఎంబీఏ చదివి.. స్వీపర్ ఉద్యోగం సంపాదించాడు!