ఎయిర్ ఇండియా, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులను ప్రధాని నరేంద్రమోదీ అభినందించారు. కరోనా వ్యాప్తి మొదలైన చైనాలోని వుహాన్ నుంచి భారత్తో పాటు మాల్దీవులకు చెందిన పౌరులను తీసుకొచ్చినందుకు ప్రశంసించారని ప్రధాని కార్యాలయం తెలిపింది.
"వుహాన్ నుంచి భారత పౌరుల తరలింపులో పాల్గొన్న బృందానికి ప్రధాని మోదీ ప్రశంసాపత్రం జారీ చేశారు. సిబ్బందికి ఈ లేఖను పౌరవిమానయాన సహాయ మంత్రి అందిస్తారు."
-ప్రధాని కార్యాలయం ప్రకటన
వుహాన్ నుంచి భారతీయులను తరలించటంలో ఎయిర్ఇండియా చురుకుగా వ్యవహరించింది. వుహాన్లో పరిస్థితి గురించి తెలిసినా రెండు భారీ విమానాలను ఎయిర్ఇండియాతో పాటు ఆరోగ్య శాఖ సిబ్బంది అక్కడికి వెళ్లారు.
కేబినెట్ భేటీలోనూ..
ఈ నెల 5న జరిగిన కేబినెట్ భేటీలోనూ విమాన సిబ్బందికి కేంద్రమంత్రులు అభినందనలు తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి భయం లేకుండా విధులు నిర్వహించారని ప్రశంసించారు.