దేశాభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి సుష్మాస్వరాజ్ అని కీర్తించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. కేంద్ర మాజీ మంత్రి, భాజపా దివంగత నేత సుష్మాస్వరాజ్ సంస్మరణ సభను దిల్లీ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించారు. ఈ సభకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సహా ప్రభుత్వ అధికారులు, వివిధ పార్టీల నేతలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు.
సుష్మ కలలను నిజం చేసేందుకు.... చిత్తశుద్ధితో పనిచేస్తామని... ఆమె ఆదర్శాలను ముందుకు తీసుకెళ్తామని మోదీ ఉద్ఘాటించారు.
"2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నారు సుష్మాస్వరాజ్. ఆమె తన నిర్ణయాలపై స్థిరంగా ఉండేవారు. నేను, వెంకయ్యనాయుడు వెళ్లి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఒప్పించే ప్రయత్నం చేశాం... కానీ ఒప్పుకోలేదు. పార్టీకోసం తాను ఎన్నికల ప్రచారం మాత్రం చేస్తానన్నారు. ఒక్క కార్యక్రమానికీ కాదనకుండా హాజరయ్యారు. ఆమె సిద్ధాంతాల పట్ల స్థిరంగా ఉండేవారు... వాటిని చిత్తశుద్ధితో ఆచరించేవారు కూడా.
మేం చూస్తున్నాం... ప్రభుత్వం కేటాయించిన ఇంట్లో మంత్రి, ఎంపీ ఉండకపోయినా ఖాళీ చేయించేందుకు ఏళ్ల పాటు నోటీసులు ఇవ్వాల్సి వస్తుంది. కొన్నిసార్లు కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది. ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఆమె పదవీకాలం పూర్తయిన వెంటనే.. సుష్మ చేసిన మొట్టమొదటి పని... ప్రభుత్వం కేటాయించిన ఇంటిని ఖాళీ చేయడం. సుష్మాస్వరాజ్ అత్యంత ప్రభావితమైన, స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేసేవారు. ఆమె ప్రసంగంలో.. ఆలోచనల ప్రాముఖ్యత ప్రతి ఒక్కరూ గుర్తించేవారు. వ్యక్తీకరణ ప్రతిసారి నూతనంగా ఉండేది. విషయంపై అవగాహన, స్పష్టమైన వ్యక్తీకరణ ఒకరికి ఉండటం అరుదు. కానీ రెండూ కలిగి ఉండటం విశేష కృషితోనే సాధ్యమవుతుంది."
-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి
అతి తక్కువ సమయంలో విదేశాంగ శాఖలో సుష్మా సంస్కరణలు తీసుకొచ్చారన్నారు మోదీ. 70 ఏళ్ల నుంచి దేశంలో ఉన్న 77 పాస్‌పోర్టు కార్యాలయాల సంఖ్య...... సుష్మ విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఐదేళ్లలో 505కు పెరిగిందని గుర్తుచేశారు. ఈ సందర్భంగా సుష్మాస్వరాజ్ కుమార్తెకు అండగా నిలబడతామని స్పష్టం చేశారు.
'భారత ఖ్యాతిని చాటారు'
విదేశాంగ మంత్రిగా సుష్మ..... భారత ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. కష్టాల్లో ఉన్నవారు ట్వీట్ చేసిన వెంటనే స్పందించి వారికి సాయం చేసేవారని గుర్తుచేశారు. సుష్మ సేవలు దేశ ప్రజల మనసుల్లో గుర్తుండిపోతాయన్నారు.
ఇదీ చూడండి: సింహం సింగిల్‌గా రోడ్డెక్కి దాహం తీర్చుకుంది!