తూర్పు లద్దాఖ్‌లో చైనాతో వివాదం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీకి పలు సూచనలు చేశారు మన్మోహన్ సింగ్. దేశమంతా ఒక్కటై చైనాను సమర్థంగా ఎదుర్కోవాలన్నారు. దేశ భద్రతపై ప్రధాని తాను చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకోవాలన్నారు. చైనా తాను తప్పు చేయలేదని చాటుకోవడానికి అవకాశం ఇవ్వరాదని సూచించారు.
చైనా సైన్యం చేతిలో అసువులు బాసిన కర్నల్ సంతోష్ బాబు సహా అమర జవాన్లకు కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ తగిన న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వారికి ఏం తక్కువ చేసినా ప్రజల నమ్మకానికి చారిత్రక ద్రోహం చేసినట్లేనని మన్మోహన్ అన్నారు. దేశ ప్రాదేశిక సమగ్రతను కాపాడేందుకు అమర వీరులు అసమాన త్యాగం చేశారని మన్మోహన్ కీర్తించారు. వారి త్యాగం వృథాగా పోనీయరాదన్నారు.
'వివాద సమస్యను బయటపెట్టండి'
చైనాతో ఏర్పడ్డ సమస్య మరింత ముదరకుండా ప్రభుత్వంలోని అన్ని విభాగాలు పని చేయాలని సూచించారు. చైనాతో నెలకొన్న వివాదంపై సమాచారం బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. సమాచారాన్ని దాచి ఉంచడం దౌత్య నీతికి, సమర్థ నాయకత్వానికి ప్రత్యామ్నాయం కాదని మన్మోహన్ అన్నారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో దేశమంతా ఒక్కటై ప్రమాదాన్ని ఎదుర్కోవాలన్నారు.
ఇదీ చదవండి: చైనాకు వత్తాసు పలికేలా ప్రధాని ప్రకటన: కాంగ్రెస్