ప్రజాప్రయోజన కార్యక్రమాల కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటివరకు ఇచ్చిన విరాళాలు రూ.103 కోట్లు దాటినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. తన వ్యక్తిగతంగా పొదుపు చేసిన డబ్బు, కానుకలు వేలం వేయడం ద్వారా వచ్చిన ధనాన్ని విరాళంగా ఇచ్చినట్లు వెల్లడించాయి. తాజాగా పీఎం కేర్స్ నిధికి మోదీ రూ. 2.25 లక్షలు విరాళంగా అందించినట్లు తెలిపాయి.
కార్మికుల సంక్షేమ నిధికి రూ.21లక్షలు..
2019లో కుంభమేళా పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమ నిధి కోసం మోదీ... రూ. 21 లక్షలు విరాళం ఇచ్చారు. అదే ఏడాది దక్షిణ కొరియాలో అందుకున్న సియోల్ శాంతి బహుమతి ద్వారా తనకు లభించిన మొత్తం నగదు బహుమతి కోటీ 30 లక్షలు రూపాయలు.. నమామి గంగా ప్రాజెక్టు కోసం అందించారు.
ఇటీవల మోదీ... తనకు వచ్చిన కానుకలు, జ్ఞాపికలను వేలం వేయడం ద్వారా వచ్చిన రూ. 3.40 కోట్లు... నమామి గంగా కార్యక్రమానికి విరాళంగా ఇచ్చారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనకు వచ్చిన కానుకలను మోదీ వేలం వేయడం ద్వారా వచ్చిన రూ. 89.96 కోట్లు బాలికా విద్య పథకానికి విరాళంగా ఇచ్చారు.
దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం కోసం 2014లో గుజరాత్ ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగిన మోదీ... ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి కుమార్తె విద్య కోసం రూ.21 లక్షలు విరాళంగా ఇచ్చారు.
ఇదీ చూడండి: ఆ మురికివాడల్లోని 48వేల నివాసాల తొలగింపు!