భారత్లో భిన్నత్వంలో ఏకత్వం అనేది ఈ దేశ విశిష్ట లక్షణమని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దిల్లీలో ప్రజలు భయం, అనిశ్చితి, మోసం సహా ఎన్నికల్లో తప్పుడు వాగ్దానాలను ఎదుర్కోవలసి వచ్చిందన్నారు. అనధికార కాలనీలకు గత ప్రభుత్వాలు ఏమీ చేయలేకపోయాయని విమర్శించారు. భాజపా.. యాజమాన్య హక్కులు కల్పించి 40 లక్షల మంది జీవితాల్లో వెలుగులు నింపిందని పేర్కొన్నారు.
దిల్లీ రాంలీలా మైదానంలో నిర్వహించిన కృతజ్ఞత సభలో ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు గుప్పించారు ప్రధాని మోదీ. సంపన్నులు నివసించే ప్రాంతంలో 2వేల మందికి బంగ్లాలు నిర్మించి ఇవ్వటంపై ఆమ్ ఆద్మీ పార్టీపై తీవ్రంగా ధ్వజమెత్తారు.
" రామ్లీలా మైదానం అనేక వేదికలకు సాక్షిగా నిలిచింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడిచినా దిల్లీలోని పెద్ద సంఖ్యలో ప్రజలు భయం, అనిశ్చితి, మోసం, తప్పుడు ఎన్నికల వాగ్దానాలను ఎదుర్కోవలసి వచ్చింది. గత ప్రభుత్వాలు చేసిన తప్పులను ఇకపై జరగనివ్వబోం. ఆప్ ప్రభుత్వం వారి అనుకూలురకు బంగ్లాలు ఇచ్చింది కానీ.. అనధికార కాలనీవాసులకు ఏమీ చేయలేదు. భాజపా యజమాన్య హక్కులు కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపింది. గత ఐదేళ్లలో దిల్లీలో ఏడాదికి 25 కిలోమీటర్ల కొత్త మెట్రోను పొడిగించాం. ఇటీవల 14 కిలోమీటర్లు పెంచాం. మెట్రో పనులకు ఆప్ ప్రభుత్వం ఆటంకం కలిగిస్తోంది."
- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి.