మత్స్యరంగ అభివృద్ధి కోసం రూ.20,050 కోట్లతో కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు ప్రధాని నరేంద్రమోదీ. మత్స్య రంగంలో ఉత్పత్తి, ఎగుమతులు పెంచి రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు 'ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన(పీఎంఎంఎస్వై)'ను ప్రారంభించారు.
బిహార్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో దృశ్యమాధ్యమం ద్వారా పాల్గొన్నారు మోదీ. ఈ కార్యక్రమంలో కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల మంత్రి, బిహార్ గవర్నర్, ముఖ్యమంత్రి, ఇతర రాష్ట్ర మంత్రులు భాగమయ్యారు. ఇదే వేదికగా పలు పథకాలను ప్రారంభించారు.
బిహార్ పూర్ణియాలో వీర్య సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు మోదీ. రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన 75 ఎకరాల భూమిలో రూ.84.27 కోట్ల పెట్టుబడులతో ఈ ప్రాజెక్టు చేపట్టారు.
ఈ- గోపాల యాప్..
పశువుల పెంపకంలో రైతులకు సలహాలు, సూచనలు అందిచే ఈ-గోపాల యాప్‌నూ ఆవిష్కరించారు ప్రధాని. సమగ్ర బ్రీడ్ అభివృద్ధి మార్కెట్‌ప్లేస్ సమాచారాన్ని నేరుగా రైతులకు అందించేందుకే ఈ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత పశుసంవర్ధక, మత్స్య రంగంలోని రైతులతో ప్రధాని మోదీ సంభాషించారు.
పీఎంఎంఎస్వై విశేషాలు..
అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మత్స్య రంగం సుస్థిరాభివృద్ధి కోసం తీసుకొచ్చిందే పీఎంఎంఎస్వై. ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా ఐదేళ్లలో మత్స్య రంగానికి రూ.20,050 కోట్ల పెట్టుబడి అంచనాతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కేంద్రం. ఇందులో రూ.12,340 కోట్లను మెరైన్, ఇన్‌ల్యాండ్ ఫిషరీ కార్యకలాపాల కోసం, రూ.7,710 కోట్లను మత్స్య రంగంలో మౌలిక సదుపాయాలకు ప్రతిపాదించింది.
2024-25 నాటికి అదనంగా 70 లక్షల టన్నుల చేపలు ఉత్పత్తి చేయాలని, వాటి ఎగుమతి ఆదాయాన్ని రూ.లక్ష కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్రం. ఇదే సమయంలో పంటకోత అనంతరం 20-25 శాతంగా ఉన్న నష్టాలను 10 శాతానికి తగ్గించడం సహా.. ప్రత్యక్షంగా, పరోక్షంగా మత్స్య పరిశ్రమలో 55 లక్షల మందికి అదనంగా ఉపాధి కల్పించాలని కేంద్రం భావిస్తోంది.
ఇదీ చూడండి: రైతుకు రూ. 3.71 కోట్ల కరెంటు బిల్లు షాక్!