ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సంచలన నిర్ణయాలు, వక్తగానే కాకుండా వేషధారణతోనూ నిత్యం అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రధాని దుస్తులతోపాటు ఆయన ధరించిన తలపాగా అందరి దృష్టిని ఆకర్షించింది.
గురువారం ప్రధాని ధరించిన తలపాగాను 'సఫా' అంటారు. వివిధ రంగులతో తయారు చేసిన ఈ సఫాను స్వాతంత్ర్య, గణతంత్ర వేడుకల్లో ఉపయోగించడానికి ఎంతో ఇష్టపడతారు మోదీ.
ఎర్రకోట వేదికగా వరుసగా ఆరోసారి జాతినుద్దేశించి ప్రసంగించిన మోదీ.. ఈసారి తెల్లని కుర్తా, పైజామాను ధరించారు. కాషాయ రంగు శాలువాను భుజాలపై వేసుకుని.. పసుపు, ఎరుపు, ఆకుపచ్చ రంగుల కలయికలోని తలపాగాను ధరించారు.
తొలిసారి ప్రధాని బాధ్యతలు చేపట్టిన అనంతరం 2014లో 'జోధ్పూర్ బంధేజ్' తలపాగాను వాడారు మోదీ. 2018లో కాషాయ రంగు తలపాగా వినియోగించారు.
'మా ప్రధానే మా హీరో'
ప్రసంగం ముగిసిన అనంతరం ప్రధాని వెనుదిరుగుతున్న సమయంలో ఎర్రకోట వద్ద ఉన్న చిన్నారులు, పాఠశాల విద్యార్థులు మోదీతో కరచాలనం కోసం ముందుకొచ్చారు. వారందరినీ మోదీ చిరునవ్వుతో పలకరించారు. ఇందుకోసం సొంత భద్రతా సిబ్బందినే పక్కన పెట్టారు మోదీ. 'మా ప్రధానే మా హీరో' అంటూ చిన్నారులు ఎంతో సంబరపడ్డారు.
ఇదీ చూడండి- మోదీ 2.0: 'త్రివిధ దళాలకు ఉమ్మడి సారథి'