రాజస్థాన్ జైపుర్‌లోని బగరు పోలీస్ స్టేషన్ ఎదుట ప్రధాని నరేంద్రమోదీ సోదరుడు ధర్నాకు దిగారు. తనకు కేటాయించాల్సిన భద్రతా సిబ్బంది విషయమై పోలీసులతో వాదనకు దిగారు ప్రహ్లాద్ మోదీ. చివరకు ఓ ప్రైవేట్ వాహనంతో పాటు ఇద్దరు గార్డులను ఇచ్చి పంపగా... మూడు గంటల పాటు నడిచిన హంగామాకు తెరపడింది.
ప్రధాని సోదరుడు ప్రహ్లాద్ మోదీ అజ్మీర్ నుంచి జైపుర్ వస్తున్నారు. ప్రధాని సోదరుడి హోదాలో ఆయనకు ఇద్దరు భద్రతా సిబ్బందిని కేటాయించాల్సి ఉంటుంది. అయితే అజ్మీర్ నుంచి బగరు వరకు దూదూ పోలీసులు ఎస్కార్ట్ వాహనంతో పాటు ఇద్దరు భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ప్రాంతం తమ పరిధిలోకి రాదని మోదీని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు.
నిబంధనల ప్రకారం తనకు భద్రతా సిబ్బందిని కేటాయించాలని బగరు పోలీస్ అధికారులను కోరారు మోదీ. అయితే ఎస్కార్ట్ వాహనాన్ని తాము కల్పించలేమని మోదీ అభ్యర్థనను తిరస్కరించారు పోలీసులు. సొంత వాహనాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. ఆగ్రహించిన ప్రహ్లాద్ మోదీ.. జాతీయ రహదారిపై కూర్చొని నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న స్థానికులు పెద్దసంఖ్యలో ఠాణా వద్దకు వస్తున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. మోదీ డిమాండ్‌ను అంగీకరించారు.
ఇదీ చూడండి: 'దూకుడు విధానంతోనే ఉగ్రవాద నిర్మూలన'