శ్రీలంక అధ్యక్షుడిగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన గొటబాయ రాజపక్సతో సరికొత్త స్నేహగీతం ఆలపించే ప్రయత్నం చేశారు ప్రధాని నరేంద్రమోదీ. దిల్లీ పర్యటనకు వచ్చిన రాజపక్సతో... ఉగ్రవాదంపై పోరు సహా కీలక రంగాల్లో సహకారం పెంపుపై విస్తృతంగా చర్చించారు. శ్రీలంక అభివృద్ధిలో భారత్ పూర్తిస్థాయిలో అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.
"రెండు దేశాల మధ్య బహుముఖ సంబంధాలు, సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయిస్తాం. శ్రీలంక అభివృద్ధికి కట్టుబడి ఉంటామని అధ్యక్షుడికి హామీ ఇచ్చాం. ఈ నిర్ణయమనేది శ్రీలంక ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటుంది. శ్రీలంకకు భారత్ ఇచ్చే 400 మిలియన్ డాలర్ల రుణసాయంతో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధికి ఊతం లభిస్తుంది."
- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
ఉగ్రవాదంపై శ్రీలంకతో కలిసి పోరాడతామని స్పష్టంచేశారు ప్రధాని నరేంద్రమోదీ. ఇందుకోసం 50 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు.
జాలర్ల విడుదల...
శ్రీలంక అదుపులో ఉన్న జాలర్ల పడవలను భారత్కు తిరిగి అప్పగిస్తామని మోదీతో చర్చల తర్వాత ప్రకటించారు రాజపక్స.