దేశంలో మరో రెండు కరోనా కేసులు నమోదైన వేళ ప్రధాని నరేంద్రమోదీ తొలిసారి స్పందించారు. ప్రస్తుత పరిస్థితిపై విస్తృత సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. ఎలాంటి భయం అక్కర్లేదని, స్వల్పంగా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని సూచించారు.
"కరోనా వైరస్‌కు సంబంధించి సంసిద్ధతపై విస్తృతంగా సమీక్షించాను. వివిధ మంత్రిత్వశాఖలు, రాష్ట్రాలతో కలిసి పనిచేస్తున్నాయి. విదేశాల నుంచి వస్తున్న వారికి స్క్రీనింగ్ దగ్గరి నుంచి సరైన వైద్య సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
ఇందులో భయపడడానికి ఏమీ లేదు. మనం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. చిన్నవే అయినా మీ ఆరోగ్యం కోసం స్వీయ జాగ్రత్తలు తీసుకోండి."
- నరేంద్రమోదీ, ప్రధానమంత్రి
ఆగ్రాలో ఆరుగురిని వైరస్ అనుమానితులుగా గుర్తించి ఐసోలేషన్ వార్డులో ఉంచి పరీక్షిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ ఆరుగురు దిల్లీలో నిన్న నిర్ధరించిన వైరస్ బాధితుడితో సన్నిహితంగా ఉన్నవారని తెలిపింది. హైదరాబాద్‌లోనూ సోమవారం ఒక కేసు నమోదైంది.