అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు నిజమైతే.... ప్రధాని నరేంద్రమోదీ దేశ ప్రయోజనాలను పణంగా పెట్టి, ద్రోహానికి పాల్పడినట్లేనని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు.
"బలహీనమైన విదేశాంగ మంత్రిత్వశాఖ ఎన్ని కబుర్లు చెప్పినా లాభంలేదు. ప్రధాని మోదీ.. తనకు, ట్రంప్‌కు మధ్య జరిగిన సమావేశంలో ఏం జరిగిందో దేశానికి తెలియజేయాలి" అని రాహుల్ డిమాండ్ చేశారు.
"భారత్, పాకిస్థాన్ మధ్య ఉన్న కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం మధ్యవర్తిత్వం వహించాల్సిందిగా ప్రధాని మోదీ తనను కోరారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. ఇదే నిజమైతే.... ప్రధాని మోదీ భారత ప్రయోజనాలకు, 1972 సిమ్లా ఒప్పందానికి ద్రోహం చేసినట్లే."
-రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ నేత'అది నిజమైతే... మోదీ దేశ ద్రోహానికి పాల్పడినట్లే'
మోదీ... మౌనం ఎందుకు?
కశ్మీర్ అంశంలో భారత్, పాక్ మధ్య తృతీయ పక్షం జోక్యం అనవసరమని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ప్రకటనను నిన్న కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. అయితే ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించింది.
ఖండించిన విదేశాంగమంత్రి
ట్రంప్ వ్యాఖ్యలను విదేశాంగమంత్రి జైశంకర్ తోసిపుచ్చారు. ప్రధాని మోదీ ట్రంప్ మధ్యవర్తిత్వాన్ని కోరలేదని రాజ్యసభలో స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: బలపరీక్ష జరుగుతుందని సుప్రీం ఆశాభావం