కరోనాపై పోరులో వారణాసి ముందుందని ప్రశంసించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇందులో ఎన్జీఓలు, సామాజిక సంస్థలు, ప్రజల పాత్ర ఎంతో ఉందని కొనియాడారు. కరోనా భయాలు మొదలైనప్పటి నుంచే స్థానిక యంత్రాంగంతో ఎన్జీఓలు, ప్రజలు చేతులు కలిపారని మోదీ పేర్కొన్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకున్నారని, అవసరమైన అందరికీ ఆహార ధాన్యాలు అందేలా చురుగ్గా వ్యవహరించారని కొనియాడారు.
కరోనా కట్టడి చర్యలు, స్థానిక పరిస్థితుల గురించి.. తన సొంత నియోజకవర్గం వారణాసిలోని ఎన్జీఓలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించారు మోదీ.
![PM applauds role of people of Varanasi in helping needy during COVID crisis](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7954486_2.jpg)
మాస్క్‌లు ధరించటం, భౌతిక దూరం పాటించటం వంటి నిబంధనలను ప్రజలు తప్పనిసరిగా పాటించాలని మోదీ సూచించారు.
బ్రెజిల్ కంటే తక్కువే..
సుమారు 24 కోట్ల జనాభా ఉన్న యూపీలో కరోనా వ్యాప్తి అదుపులో ఉండటమే కాకుండా.. బాధితులూ వేగంగా కోలుకుంటున్నారని అన్నారు మోదీ. దాదాపు ఇంతే జనాభా ఉన్న బ్రెజిల్లో వేల మంది చనిపోగా.. ఉత్తర్‌ప్రదేశ్‌లో 800 మంది మరణించినట్లు గుర్తుచేశారు.
![PM applauds role of people of Varanasi in helping needy during COVID crisis](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7954486_1.jpg)
'' ఈ సావన్ నెలలో వారణాసి ప్రజలతో మాట్లాడడం.. శివుడిని సందర్శించిన అనుభూతిని కలిగిస్తుంది. ఆ భోలేనాథుని ఆశీస్సులతోనే కొవిడ్ సంక్షోభంలోనూ వారణాసి ప్రజలు ధైర్యంగా ఉన్నారు.
100 సంవత్సరాల క్రితం కూడా ఇలాంటి మహమ్మారే పుట్టుకొచ్చింది. అప్పట్లో భారత జనాభా కూడా ఇంతలా లేదు. అయినా ఎక్కువ మరణాలు సంభవించాయి. అందుకే.. ప్రపంచ దేశాలు భారత్‌పై కాస్త ఆందోళనగా ఉన్నాయి. ఇప్పుడూ అలాంటి పరిస్థితే వస్తుందని నిపుణులు అంటున్నారు. కానీ ఏమైంది? సుమారు 24 కోట్ల జనాభా ఉన్న యూపీ.. ప్రజల మద్దతుతో భయాలన్నింటినీ అధిగమించింది.''
- నరేంద్ర మోదీ, భారత ప్రధాన మంత్రి.
వారణాసి ఎగుమతి కేంద్రంగా మారుతుందని, రాబోయే రోజుల్లో 'ఆత్మ నిర్భర్ భారత్' ప్రచారంలోనూ కీలకంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు మోదీ.
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇప్పటివరకు 31 వేల 156 మంది కరోనా బారినపడ్డారు. 845 మరణాలు సంభవించాయి. దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ వైరస్ వ్యాప్తి కాస్త తక్కువగా ఉంది.