ఎన్డీఏ 2.0 తొలి 100 రోజుల పాలనలో అవినీతి నిర్మూలన, దేశాభివృద్ధి, ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో తొలగించడానికి ఎన్నో చర్యలు చేపట్టినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఝార్ఖండ్ రాజధాని రాంచీ వేదికగా పలు పింఛను పథకాలను ప్రారంభించారు మోదీ.
"కామ్దార్(పనిచేసే), దందార్(దమ్మున్న) ప్రభుత్వాన్ని ఇస్తానని ఎన్నికల సమయంలో మీకు హామీనిచ్చా. ఎలాంటి ప్రభుత్వమైతే.. మీ ఆకాంక్షలను నెరవేర్చడం కోసం తన శక్తినంతా ధారపోస్తుందో.. అలాంటి ప్రభుత్వానికి సంబంధించిన ట్రైలర్‌ను దేశం ఈ 100 రోజుల్లో(ఎన్డీఏ ప్రభుత్వం) చూసింది. ఇక సినిమా బాకీ ఉంది. ముస్లిం సోదరీమణుల హక్కుల రక్షణే మా సంకల్పం. 100 రోజుల్లోపే ముమ్మారు తలాక్ చట్టాన్ని తొలగించాం. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడటం మా సంకల్పం. తొలి 100 రోజుల్లోనే ఉగ్రవాద వ్యతిరేక చట్టాన్ని మరింత కఠినం చేశాం. జమ్ముకశ్మీర్, లద్దాఖలను అభివృద్ధి చేయడమే మా సంకల్పం. 100 రోజుల్లో దీనికి సంబంధించిన పనులను ప్రారంభించాం."
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
ఒకప్పుడు చట్టాలకు అతీతమనుకున్న వారు.. ప్రస్తుతం కోర్టుల చుట్టూ బెయిల్ కోసం తిరుగుతున్నారని విమర్శించారు మోదీ.
ప్రధాన మంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన, ప్రధాన మంత్రి లఘు వ్యాపారిక్ మాన్‌ధన్ యోజన, స్వరోజ్‌గార్ పింఛను పథకాలను ప్రధాని ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా 462 ఏకలవ్య మోడల్ స్కూల్స్‌కు ఆన్లైన్ ద్వారా శంకుస్థాపన చేశారు.
ప్రధానమంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన.. రైతులకు సామాజిక భద్రతను కల్పించనుంది. 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న రైతులు ఈ పథకం కింద పేరు నమోదు చేసుకోవచ్చు. 60 ఏళ్ల వయస్సు వచ్చాక వారికి నెలకు 3 వేల రూపాయల చొప్పున పెన్షన్ లభిస్తుంది.
ప్రధాన మంత్రి లఘు వ్యాపారిక్ మాన్‌ధన్ యోజన, స్వరోజ్‌గార్ పింఛను పథకాల లబ్ధిదారులకు కూడా ఇవే నియమాలు వర్తించనున్నాయి. పింఛను పథకాల ప్రారంభోత్సవంతో పాటు ఝార్ఖండ్ అసెంబ్లీ కొత్త భవనాన్నీ ఆవిష్కరించారు మోదీ.
ఇదీ చూడండి:- ఈడీ ముందుకు ఐశ్వర్య- పన్ను ఎగవేతపై ప్రశ్నల వర్షం