వయసుతో సంబంధం లేకుండా నేడు చాలా మంది ఆస్తమా బారిన పడుతున్నారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు తగు జాగ్రత్తలు పాటించాలని పలు పరిశోధనలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా ఎలాంటి ఆహార పదార్ధాలు తీసుకోవాలి.. ఎలాంటి వాటికి దూరంగా ఉండాలనే దానిపై ఓ సర్వే వెల్లడించింది. అధిక కొవ్వు ఉన్న ఆహార పదార్థాలు, నూనెలు, పాల ఉత్పత్తులు ఈ ప్రమాదాన్ని మరింతగా పెంచుతుండగా.. కూరగాయలు ఆస్తమాను అదుపులో ఉంచుతాయని స్పష్టం చేసింది.
ఈ పరిశోధన జర్నల్ న్యూట్రీషియన్ రీవ్యూవ్లో ప్రచురితమైంది. ఆస్తమా బాధితులకు ఇచ్చే ఆహారంలో మార్పులు చేస్తూ ఎనిమిది వారాల పాటు పరిశీలించి నివేదిక రూపొందించారు పరిశోధకులు. ఆస్తమా వల్ల దగ్గు, శ్వాస తీసుకోలేకపోవడం వంటి శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి తరుణంలో సహజ సిద్ధంగా తయారయ్యే ఆకుకూరలు, పండ్లు, తృణధాన్యాలు ఎంతో మంచిదని తేల్చారు పరిశోధకులు.
" 25 మిలియన్ల అమెరికన్లు ఆస్తమా బారిన పడ్డారు. ప్రస్తుతం కొవిడ్-19 వ్యాప్తి ఈ ఆస్తమా ఉన్న వారికి మరింత హాని చేస్తుంది. ఈ ఆస్తమాను అదుపు చేసేందుకు ఆహారంలో మార్పులు చేయడం ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం."
- హనా కహ్లియోవా, ఫిజిషియన్ కమిటీ క్లినికల్ రీసెర్చ్ డైరెక్టర్ ఎండీ, పీహెచ్డీ
ఎనిమిది వారాల్లో..
ఆస్తమా అదుపులో ఉంచేందుకు ఎనిమిది వారాల పాటు కూరగాయలు, తృణధాన్యాలు, పండ్లను ఆహారంగా తీసుకోవడం వల్ల మంచి ఫలితం వచ్చిందని పరిశోధకులు తెలిపారు. సంవత్సరం పాటు ఈ డైట్‌ను కొనసాగించి.. పరిశీలించగా ఎంతో మెరుగుదలను గుర్తించినట్లు చెప్పారు. ఇలాంటి ఆహారంలో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుందన్నారు.
పాల ఉత్పత్తులతో ఇబ్బందులు
పాల ఉత్పత్తులు అధికంగా తీసుకోవడం వల్ల ఆస్తమా అదుపు కాకపోవడమే కాకుండా ఎక్కువయ్యే ప్రమాదం ఉందని వెల్లడించింది పరిశోధన. ఆస్తమా ఉన్న చిన్న పిల్లలకు పాల ఉత్పత్తులు అధికంగా ఇవ్వడం వల్ల సమస్య ఎక్కువైనట్లు వెల్లడించింది. ఈ వ్యాధి బారిన పడిన చిన్నారులకు 8 వారాల పాటు పాలు, గుడ్లు ఇవ్వలేదు. దీని వల్ల 22శాతం ఆస్తమా అదుపులో ఉందని వెల్లడించారు.
కరోనా సమయంలో మరింత జాగ్రత్త
ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్నకరోనా వైరస్ బారిన పడకుండా ఆస్తమా వ్యాధిగ్రస్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు పరిశోధకులు. సమయానుగుణంగా మందులు తీసుకొని, శుభ్రతను పాటించాలని సూచించారు.
ఇదీ చదవండి: ఉప్పు ఎక్కువ తింటే కరోనా వచ్చే ముప్పు!