కేరళ కోజికోడ్ విమాన ప్రమాదంపై ఐదుగురు సభ్యులతో కూడిన విచారణ ప్యానెల్‌ను ఏర్పాటు చేసినట్లు విమాన ప్రమాద దర్యాప్తు బోర్డు(ఏఏఐబీ) తెలిపింది. ఈ ప్యానెల్ ఐదు నెలల్లో నివేదిక ఇస్తుందని పేర్కొంది. బోయింగ్ 737 ఎన్‌జీ విమాన మాజీ పరిశీలకుడు కెప్టెన్ ఎస్ఎస్ చాహర్ ఈ ప్యానెల్‌కు దర్యాప్తు ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించనున్నారు.
దర్యాప్తు ఇన్ ఛార్జి అవసరమైనప్పుడు నిపుణులు, ఇతర సంస్థల సహకారం తీసుకుంటారని ఏఏఐబీ తెలిపింది. దర్యాప్తునకు సంబంధించి ప్రధాన కార్యాలయం దిల్లీలో ఉంటుందని చెప్పింది. సంఘటనా స్థలం నుంచి ప్రయాణికులకు చెందిన 298 సామగ్రి ముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ తెలిపింది.
ఈ నెల 7న జరిగిన ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 18 మంది చనిపోయారు. 92 మంది ప్రయాణికులు గాయాల నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లినట్లు అధికారులు వెల్లడించారు.