ఈడీ కార్యాలయానికి వెళ్తానన్న ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రకటనతో నెలకొన్న ఉద్రిక్తతలకు తాత్కాలికంగా తెరపడింది. శాంతిభద్రతల దృష్ట్యా ఈరోజు తాను ఈడీ అధికారుల వద్దకు వెళ్లడంలేదని ప్రకటించారు పవార్.
కమిషనర్ రాయబారంతో...
మనీలాండరింగ్ కేసులో సమాచారం ఇచ్చేందుకు మధ్యాహ్నం 2 గంటలకు ఈడీ కార్యాలయానికి వెళ్తానని ఇటీవల ప్రకటించారు పవార్. అందుకు కొద్దిసేపటి ముందు ముంబయిలోని ఆయన నివాసానికి నగర కమిషనర్ సంజయ్ బార్వే వచ్చారు. ఈడీ కార్యాలయం వద్ద నిషేధాజ్ఞలు ఉన్నందున విచారణకు వెళ్లాలన్న ఆలోచనను విరమించుకోవాలని సూచించారు.
కమిషనర్ అభ్యర్థన పట్ల పవార్ సానుకూలంగా స్పందించారు. శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని ఈరోజు ఈడీ విచారణకు హాజరుకావడం లేదని ప్రకటించారు.
కేంద్రంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు పవార్. కేసులను అడ్డంపెట్టుకుని విపక్ష నేతలను అప్రతిష్ఠపాలు చేసేందుకు మోదీ సర్కార్ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.
ఇదీ కేసు...
మహారాష్ట్ర సహకార బ్యాంకుకు సంబంధించిన రూ.25 వేల కోట్ల కుంభకోణం వ్యవహారంలో శరద్ పవార్, ఆయన మేనల్లుడు అజిత్ పవార్‌పై మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది.
విచారణకు రావాలని ఈడీ ఇప్పటివరకు పవార్‌కు సమన్లు జారీచేయలేదు. అయినా... మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ముందు కేసు నమోదును తీవ్రంగా పరిగణించారు పవార్. ఈడీ పిలవకపోయినా... తానే ముంబయిలోని కార్యాలయానికి వెళ్లి, కేసుకు సంబంధించిన సమాచారం అంతా ఇస్తానని ఈనెల 25న ప్రకటించారు.
కార్యాలయం వద్ద కట్టుదిట్టమైన భద్రత...
పవార్‌తో పాటు ఎన్సీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో వచ్చే అవకాశముందని అధికారులు భావించారు. ముందు జాగ్రత్తగా ఈడీ కార్యాలయం వద్ద 144 సెక్షన్ విధించారు.