మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ఇప్పట్లో ఓ కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. సర్కారు ఏర్పాటుపై అనిశ్చితి కొనసాగుతోన్న వేళ.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్... కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో దిల్లీలో భేటీ అయ్యారు. శివసేనతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై ఈ భేటీతో ఓ స్పష్టత వస్తుందని అంతా భావించారు. అయితే అగ్రనేతల భేటీతోనూ మహారాష్ట్రలో సర్కారు ఏర్పాటుపై ఎలాంటి ముందడుగు పడలేదు.
భేటీ అనంతరం.. శరద్ పవార్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
"మహారాష్ట్రలో ఎవరితోనైనా కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అంశంపై మేము చర్చించలేదు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపైనే పూర్తి స్థాయిలో చర్చించాం. ఎన్నికల్లో కలసి పోటీ చేసిన మిత్రపక్షాలతో చర్చించాల్సి ఉంది. మహారాష్ట్ర రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తున్నాం. కాంగ్రెస్, ఎన్సీపీ నాయకులు.. భవిష్యత్ కార్యాచరణపై మరిన్ని చర్చలు జరుపుతారు."
- శరద్ పవార్, ఎన్సీపీ అధినేత
కాంగ్రెస్ స్పందన...
పవార్- సోనియా భేటీపై ఇదే తరహా ప్రకటన చేసింది కాంగ్రెస్.
"మహారాష్ట్రలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వివరించారు. ఒకట్రెండు రోజుల్లో ఎన్సీపీ, కాంగ్రెస్ ముఖ్య నాయకులు.. దిల్లీలో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తారు."
- రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి
చర్చోపచర్చలు...
శివసేనతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంపై కాంగ్రెస్, ఎన్సీపీ కొద్ది రోజులుగా వరుస చర్చలు జరుపుతున్నాయి. అయితే సోనియాతో భేటీకి ముందు ప్రభుత్వ ఏర్పాటు అంశంపై మీడియాతో పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. "ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకునేవారు ఎవరి దారి వారు చూసుకోవాలి, ఎవరి రాజకీయం వారిదే"అని అన్నారు.
- ఇదీ చూడండి: ఠాక్రే అయోధ్య పర్యటన వాయిదా... కారణం ఏంటి?