ఒడిశాలో మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, బిజూ జనతా దళ్ అధినేత నవీన్ పట్నాయక్. ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో తమ పార్టీ గెలవడం తథ్యమని, తన ప్రమాణస్వీకారానికి రావాలని ప్రధాని మోదీని ఆహ్వానించారు.
ఒడిశాలో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు నాలుగు దశల్లో పోలింగ్ జరగనుంది. ఇప్పటికే మూడు దశలు పూర్తయ్యాయి. నాలుగో దశ పోలింగ్ ఈ నెల 29న జరుగుతుంది. మే 23న ఫలితాలు వెలువడతాయి.
ఇప్పటికే గెలిచేశాం
మూడు దశల పోలింగ్‌లో తమ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన ఓట్లు, స్థానాలు సాధించామని విశ్వాసం వ్యక్తం చేశారు సీఎం నవీన్ పట్నాయక్.
" బీజేడీ అధికారంలో నుంచి దిగిపోయాక రాష్ట్రంలోకి వస్తానని ప్రధాని మోదీ మంగళవారం అన్నారు. కానీ మూడు దశల పోలింగ్ తర్వాతే బీజేడీ విజయాన్ని ఖాయం చేసుకుంది. నేను ప్రధానిని సవినయంగా బీజేడీ ప్రభుత్వ ప్రమాణస్వీకార కార్యక్రమానికి అతిథిగా ఆహ్వానిస్తున్నా" -- నవీన్ పట్నాయక్, ఒడిశా సీఎం, బీజేడీ అధినేత
కష్టాల్లో ఉన్నప్పుడు రాలేదు
భాజపాపై విమర్శల దాడి చేశారు నవీన్ పట్నాయక్. రాష్ట్రం కష్టకాలంలో ఉన్నప్పుడు మోదీ ఇక్కడికి రాలేదని ఆరోపించారు.
"తుపానులు, వరదలు, కరువుల బారీన పడి ఒడిశా కష్టాల్లో ఉన్న సమయంలో ప్రధానమంత్రి రాలేదు. అప్పుడు ఆయనకు సమయం లేదు. ఎన్నికలు వచ్చినప్పటి నుంచి రాష్ట్రానికి చాలాసార్లు వస్తున్నారు. మొసలి కన్నీరు కారుస్తున్నారు"
-- నవీన్ పట్నాయక్, ఒడిశా సీఎం, బీజేడీ అధినేత