కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి జి.పరమేశ్వరకు ఐటీ ఉచ్చు బిగుసుకుంటున్న వేళ అతడి సహాయకుడి ఆత్మహత్య కలకలం రేపింది. రమేశ్... బెంగళూరులోని తన నివాసానికి దగ్గర్లోని మైదానంలో ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
పరమేశ్వరపై ఐటీ దాడులలో భాగంగా ఇటీవలే రమేశ్ ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. అతడ్ని ప్రశ్నించారు. ఈ ఒత్తిడి భరించలేకే రమేశ్ ఆత్మహత్య చేసుకున్నాడని కర్ణాటక కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
రమేశ్ మృతిపై మాజీ ఉపముఖ్యమంత్రి పరమేశ్వర స్పందించారు. "అతడు ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడో తెలియదు. ఈరోజు ఉదయం కూడా మాట్లాడాను. ధైర్యంగా ఉండాలని సూచించాను" అని చెప్పారు.
కర్ణాటక రాంనగర్‌లోని మెల్లెహళ్లికి చెందిన రమేశ్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టైపిస్ట్‌గా చేరారు. స్వల్ప కాలంలోనే పరమేశ్వరకు అత్యంత ఆప్తుడయ్యారు.