దేశవ్యాప్తంగా పౌరసత్వ చట్ట సవరణపై నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. అన్ని వర్గాల వారు ఒక్కటై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపడుతున్నారు. అయితే నిరసనకారుల 'నినాదాలు' ఎంతో ప్రత్యేకంగా, సృజనాత్మకంగా ఉండటం.. ఆందోళనకారుల్లో నూతన ఉత్తేజాన్ని తెచ్చిపెడుతున్నాయి.
'జనతా మాంగే రోజీ రోటీ.. మిల్తే ఉన్కో లాఠీ గాలీ..'(ప్రజలు ఉద్యోగాలు అడుగుతుంటే... లాఠీ దెబ్బలు దక్కుతున్నాయి), 'బోల్ కే లబ్.. ఆజాద్ హై తేరే'(మాట్లాడు... అది నీ హక్కు) అంటూ నిరసనకారులు చేస్తున్న నినాదాల వల్ల పౌర నిరసనలు ఎంతో హుషారుగా సాగుతున్నాయి. ముఖ్యంగా ఆందోళనలు ఉద్ధృతంగా జరుగుతున్న దేశ రాజధాని దిల్లీలో ఇలాంటి సృజనాత్మక నినాదాలు.. ఆందోళనకారులను ఎంతో ఉత్తేజ పరుస్తున్నాయి.
ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువు, జలఫిరంగులను ఉపయోగిస్తున్నారు. వాటికి వ్యతిరేకంగా ఓ నిరసనకారుడు చేసిన 'పానీ మేరే నైనన్ మే... జిత్నా వాటర్ కేనాన్ మే...' నినాదం ఎంతో ఆకట్టుకుంటోంది.
తమ హక్కుల కోసం పోరాడుతున్నప్పుడు యువత ఎవరికీ భయపడకూడదు అని చెప్పడానికే తాను ఈ నినాదం చేసినట్టు తెలిపాడు ఓ నిరసనకారుడు. అంతే కాకుండా... తమపై లాఠీలతో విజృంభిస్తున్న పోలీసులతో మైత్రి ఏర్పరుచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఆందోళనకారులు. 'లాఠీ చోడో.. సాథ్ చలో'(లాఠీలను వదలండి.. కలిసి నడవండి) అంటూ నినాదాలు చేస్తున్నారు.
వీటితో పాటు పోస్టర్లు, ప్లకార్డుల్లోనూ సృజనాత్మకతను ప్రదర్శిస్తూ నిరసనలకు ప్రాణం పోస్తున్నారు.