పుల్వామా దాడి అనంతరం భారత్‌తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పొరుగు దేశం పాకిస్థాన్ దిద్దుబాటు చర్యలను కొనసాగిస్తోంది. బందీలుగా ఉన్న 100మంది భారత జాలర్లను శుక్రవారం విడుదల చేసింది. ఇప్పటికే ఈ నెల 7న 100 మంది జాలర్లను భారత్‌కు పంపింది. వీరు ఇప్పటివరకు కరాచీలోని మాలీర్ జైల్లో ఉన్నారు. లాహోర్‌కు తీసుకువచ్చి అక్కడి నుంచి అటారీ-వాఘా సరిహద్దు ద్వారా భారత్‌కు అప్పగించింది.
ఈ నెల 7వరకు పాక్ చెరలో 360 మంది భారత జాలర్లు ఉండగా 200 మందిని విడుదల చేసింది. ఈ నెల 22న మరో 100 మందిని స్వదేశానికి పంపిస్తామని ప్రకటించింది పాక్. ఈ నెల 29న 55 మంది జాలర్లు, ఐదుగురు బందీలను వెనక్కి పంపించడం ద్వారా ఈ ప్రక్రియ ముగియనుంది.
తాము ఏ ప్రాదేశిక జలాల్లో పయనిస్తామో తెలిపే సాంకేతికత లేని నాటు పడవల కారణంగా ఇరు దేశాల జాలర్లు బంధీలుగా మారుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇరు వైపులా జాలర్ల అప్పగింతకు నెలల సమయం పడుతోంది. కొన్ని సార్లు సంవత్సరాల కాలం పడుతోంది.