నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ, విజయ్ మాల్యా సహా.. 50మంది రుణ ఎగవేతదారుల రుణాలను మోదీ సర్కార్ మాఫీ చేసిందని కాంగ్రెస్ ఆరోపించింది. సమాచార హక్కు చట్టం సమాధానం కింద రిజర్వు బ్యాంకు ఇచ్చిన సమాధానం మేరకు 68 వేల 607 కోట్ల రూపాయలు విలువైన రుణాలు మాఫీ చేసినట్లు హస్తం పార్టీ పేర్కొంది.
2014 నుంచి 2019 సెప్టెంబరు వరకూ 6లక్షల 66 వేల కోట్ల రూపాయల రుణాలను కేంద్రం మాఫీ చేసిందని కాంగ్రెస్ విమర్శించింది. అగ్రస్థానంలో ఉన్న 50 మంది రుణ ఎగవేతదారుల వివరాలను పార్లమెంటులో కోరితే ఆర్థికమంత్రి సమాధానం ఇవ్వలేదని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇప్పుడు ఆర్బీఐ ఇచ్చిన నివేదికలో నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ సహా అనేక మంది భాజపా మిత్రులు ఉన్నారని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టం సమాధానం కింద ఆర్బీఐ ఇచ్చిన 50మంది ఎగవేతదారుల పేర్లు విడుదల చేసింది.
ఆర్బీఐ తెలిపిన వివరాలు..
చోక్సీ కంపెనీ రూ.5,492 కోట్లతో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత ఆర్ఈఐ ఆగ్రో రూ.4,314 కోట్లు, విన్సమ్ డైమండ్స్ రూ.4,076 కోట్లు, రోటోమాక్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.2,850 కోట్లు, కుడోస్ కెమీ లిమిటెడ్ 2,326 కోట్లు, పతాంజలి రుచి సోయా సంస్థ రూ.2,212 కోట్లు, జూమ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.2,012 కోట్లు, మాల్యా కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ రూ.1,943 కోట్లు, ఫరెవర్ ప్రెషియస్ జువెలరీ అండ్ డైమండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.1,962 కోట్లు, డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ రూ .1915 కోట్లు, గిలి ఇండియా రూ.1,447 కోట్లు, నక్షత్ర బ్రాండ్స్ రూ.1,109 కోట్లు ఉన్నట్లు తెలిపింది.