అయోధ్యలో ఆగస్టు 5న రామ మందిర నిర్మాణ భూమిపూజ కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్య పరిసర ప్రాంతాల్లో ఉగ్రదాడులకు కుట్రలు జరుగుతున్నాయన్న నిఘా వర్గాల హెచ్చరికతో ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు అప్రమత్తమయ్యారు.
ఆగస్టు 5నే జమ్ముకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేసిన రోజు కావున.. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా భద్రత చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం వరకు బలగాల కొనసాగింపు ఉంటుందని తెలిపారు.
రంగంలోకి 3500 మంది
అయోధ్యలో భూమిపూజ నేపథ్యంలో రంగంలోకి 3,500 మందికిపైగా భద్రత సిబ్బందిని మోహరించనున్నట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. 500 డ్రోన్ కెమెరాలతో ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నట్లు చెప్పారు. నిఘాను మరింత పటిష్ఠం చేసేందుకు ఇప్పటికే 5,000 సీసీటీవీ కెమెరాలను బిగించామన్నారు.
ముమ్మర తనిఖీ..
అయోధ్యలో ఇప్పటికే తనిఖీలు ముమ్మరం చేశారు అధికారులు. ప్రధాని హెలికాప్టర్ దిగే సాకేత్ మహావిద్యాలయ ప్రాంగణంలో తనిఖీలు నిర్వహించారు. రామ్‌కోట్ ప్రాంత వాసులకు ప్రయాణాల పాసులు ఇచ్చారు. సాధారణ తనిఖీలతో పాటు ఇంటింటి తనిఖీ చేస్తున్నారు. హోటళ్లు, లాడ్జీలు, అతిథిగృహాల పర్యవేక్షణ జరుగుతోంది. నగరంలోకి వచ్చే దారులన్నింటినీ మూసివేశారు.
కొవిడ్-19 నిబంధనలు పాటించాలని, ఐదుగురికన్నా ఎక్కువ మంది ఒకచోటికి చేరొద్దని సూచించారు అయోధ్య ఎస్ఎస్పీ దీపక్ కుమార్. ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా 12 ప్రాంతాల్లో దారులు మళ్లించినట్లు చెప్పారు.
అయోధ్యకు యోగి..
రామమందిరి భూమిపూజ కార్యక్రమం కోసం జరుగుతోన్న పనులను పర్యవేక్షించేందుకు నేడు అయోధ్యలో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్.
ఇదీ చూడండి: శ్రీరామ్ జన్మభూమి ట్రస్ట్‌కు 67 ఎకరాల భూమి బదిలీ