ప్రస్తుతం జమ్మూలో 100 శాతం, కశ్మీర్‌లో 20 శాతం మంది విద్యార్థులు పాఠశాలలకు హాజరవుతున్నారని కేంద్ర హోంశాఖ తెలిపింది. మొత్తంగా రాష్ట్రంలో 21 వేల 328 పాఠశాలలు తెరుచుకున్నాయని వెల్లడించింది. జమ్ముకశ్మీర్‌లో జనసంచారంపై ఎలాంటి ఆంక్షలు లేవని ప్రకటించింది.
అక్టోబర్ 18 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,02,069 ల్యాండ్లైన్ఫోన్ల సేవలను పునరుద్ధరించామని గత శుక్రవారం వరకు 22 జిల్లాల్లో 84 శాతం చరవాణి సేవలను పునరుద్ధరించినట్లు హోంశాఖ తెలిపింది.
ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో ఆగస్టు 5 నుంచి జమ్ముకశ్మీర్‌లో జనసంచారం, వాహనాలు, ఫోన్ కనెక్షన్లపై ఆంక్షలు విధించింది సర్కారు. ఇప్పటివరకు రాష్ట్రంలోని 130 ప్రధాన ఆసుపత్రులు, 4,359 ఆరోగ్య కేంద్రాలు సేవలందిస్తున్నాయని జమ్ముకశ్మీర్ ప్రభుత్వ యంత్రాంగం పేర్కొంది. ఇప్పటికే 5 నుంచి 12 వ తరగతులకు వార్షిక పరీక్షల తేదీలను ప్రకటించారు.
ఇదీ చూడండి: నవంబర్ 9న కర్తార్‌పుర్ నడవా ప్రారంభం... కానీ...