కరోనా మహమ్మారిని గుర్తించేందుకు నిర్వహించే ఆర్టీ-పీసీఆర్ పరీక్షల సంఖ్య 10 లక్షలు దాటిందని భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. ప్రతిరోజు 70 వేలకుపైగా ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు జరిపే స్థాయికి చేరుకోవటం సహా.. శుక్రవారం సాయంత్రానికి 10 లక్షల 40 వేల పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించింది.
లాక్‌డౌన్ ప్రారంభంలో కేవలం పుణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీతో పాటు 100 కేంద్రాల్లోనే పరీక్షలు నిర్వహించామని ఐసీఎంఆర్ తెలిపింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 292 ప్రభుత్వ, 97 ప్రైవేట్ ల్యాబ్స్‌లో కరోనా పరీక్ష చేస్తున్నట్లు పేర్కొంది.
కరోనా కట్టడిలో కేరళ భేష్..
అటు..కేరళలో కరోనా మహమ్మారి కట్టడికి ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన వ్యూహాన్ని ఐసీఎంఆర్ ప్రశంసించింది. కేరళ సర్కార్ వ్యూహం సహా బలమైన ప్రజారోగ్య వ్యవస్థ వల్లే నిర్ధరణ పరీక్షలు, నియంత్రణ వ్యూహాలు పటిష్ఠంగా అమలు చేశారని పేర్కొంది.
పరిశోధన..
కరోనా వైరస్ జాతి భారత్‌లో మ్యూటేషన్‌కు గురైందా అనే అంశంపై అధ్యయనం చేయాలని భావిస్తున్నట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. సార్స్ జాతికి చెందిన కరోనా వైరస్ రూపం మారిందో లేదో నిర్ణయించటం వల్ల టీకా ప్రభావం నిర్ధరించటంలో ఇది తోడ్పతుందని ఐసీఎంఆర్ సీనియర్ శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. ఇందుకోసం కొవిడ్ రోగుల నుంచి నమూనాలను సేకరిస్తామని ఆయన చెప్పారు.
ఇదీ చూడండి:దేశంలో కరోనా వైరస్ రూపాంతరం చెందుతోందా?