మిషన్ శక్తి ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు డీఆర్డీఓ శాస్త్రవేత్తలకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అభినందనలు తెలిపారు. దేశానికి గర్వకారణమని ట్విటర్ వేదికగా కొనియాడారు. అయితే మిషన్ శక్తిపై ప్రధాని దేశ ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగాన్ని తప్పు పడుతూ ఛలోక్తులు విసిరారు రాహుల్.
'మోదీకి ప్రపంచ నాటక దినోత్సవ శుభాకాంక్షలు' -రాహుల్ ట్వీట్
మమతా బెనర్జీ స్పందన
డీఆర్డీఓ శాస్త్రవేత్తల ఘనతను మోదీ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు పశ్చిమ బంగ సీఎం మమతా బెనర్జీ.
"ఇతరుల సాధించిన ఘనతను మోదీ తన విజయంగా చెప్పుకోవడం మానాలి. ఉపగ్రహాన్ని కూల్చింది డీఆర్డీఓ శాస్త్రవేత్తలు. ఐదేళ్లుగా ప్రజల సమస్యలు పరిష్కరించడంలో మోదీ ప్రభుత్వం విఫలమైంది. ఎన్నికలకు ముందు ప్రజలను అవివేకులను చేసే పనులను భాజపా, మోదీ మానుకోవాలి. వచ్చే ఎన్నికల్లో దీని ప్రభావం ఏమీ ఉండదు."
- ట్విటర్లో మమతా బెనర్జీ
అఖిలేశ్ యాదవ్ స్పందన
ప్రజల సమస్యలను ప్రస్తావించకుండా ప్రధాని టీవీ కార్యక్రమాల్లోనే కాలక్షేపం చేస్తున్నారని ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ అన్నారు. దేశ ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
" ఈరోజు ప్రధాని గంటపాటు టీవీకే అంకితమయ్యారు. నిరుద్యోగం, గ్రామీణసంక్షోభం, మహిళల భద్రత వంటి సమస్యల నుంచి దేశ ప్రజల దృష్టిని ఆకాశం వైపు మళ్లిస్తున్నారు. అద్భుత విజయం సాధించినందుకు డీఆర్డీఓకు అభినందనలు."
-అఖిలేశ్ యాదవ్, యూపీ మాజీ సీఎం
డీఆర్డీఓ విజయం యూపీఏ ఘనతే: కాంగ్రెస్
యూపీఏ ప్రభుత్వ హయంలో శ్రీకారం చుట్టిన ఏశాట్ కార్యక్రమం ఇప్పటికి సత్ఫలితాలిచ్చిందని కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ అన్నారు. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ను ప్రశంసించారు.
"ఈ ఘనత సాధించినందుకు డీఆర్డీఓ, ప్రభుత్వానికి అభినందనలు. భారత అంతరిక్ష పరిశోధన కార్యక్రమాలు 1961లో జవహర్లాల్ నెహ్రూ ప్రారంభించారు. ఇందిరా గాంధీ హయాంలో నెలకొల్పిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఎన్నో ఘనతలు సాధించి దేశానికి గర్వకారణమైంది. "
-కాంగ్రెస్ అధికారిక ట్విటర్ పేజీ
దేశ భద్రత అంశాలు ఎన్నికల నియమాళిలోకి రావు: ఈసీ
ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో మిషన్ శక్తి విజయవంతమైందని ప్రధాని ప్రకటించడం ఎన్నికల కోడ్ను ఉల్లంఘించడం కాదా అన్న సందేహాలకు ఎన్నికల సంఘం సమాధానమిచ్చింది.
దేశ భద్రతకు సంబంధించిన విషయాలకు ఎన్నికల ప్రవర్తన నియమావళి వర్తించదని అధికారులు తెలిపారు.