వ్యవసాయ రంగంలో సంస్కరణల పేరుతో కేంద్రం తీసుకొచ్చిన బిల్లులు రైతులకు నష్టం చేకూర్చేలా ఉన్నాయని, ఈ విషయంపై మాట్లాడేందుకు రాష్ట్రపతిని అనుమతి కోరాయి విపక్షాలు. ఇందుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అంగీకారం తెలిపినట్లు అధికార వర్గాలు చెప్పాయి. ఈరోజు సాంయత్రం 5 గంటలకు విపక్ష నేతలు కోవింద్‌ను కలవచ్చని రాష్ట్రపతి భవన్ పేర్కొన్నట్లు తెలిపాయి. కరోనా ప్రోటోకాల్ అమలులో ఉన్నందున విపక్షాల నుంచి ఐదుగురు నేతలను మాత్రమే అనుమతించనున్నట్లు తెలుస్తోంది.
విపక్షాల ఆందోళనల నడుమ రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) బిల్లు-2020, రైతుల సాధికారత, రక్షణ, వ్యవసాయ సేవల బిల్లు- 2020ను ఈనెల 20న పార్లమెంటు ఆమోదించింది.
బిల్లు ఆమోదం సమయంలో 8 మంది సభ్యులు అనుచితంగా ప్రవర్తించారని ఆ మరునాడే వారిపై సస్పెన్షన్ వేటు వేశారు ఛైర్మన్. ఈ చర్యను ఖండించిన విపక్షాలు పార్లమెంటు సమావేశాలను మంగళవారం బహిష్కరించాయి. బిల్లులను ఆమోదిస్తూ సంతకం చేయొద్దని రాష్ట్రపతిని కోరాయి.