కేరళ ప్రజలకు కరోనా టీకాను ఉచితంగానే అందిస్తామని సీఎం పినరయి విజయన్ చేసిన ప్రకటనను రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాయి విపక్షాలు. ఈ విషయంపై కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్, భాజపా వేర్వేరుగా ఫిర్యాదు చేశాయి. డిసెంబర్ 14న స్థానిక ఎన్నికలు జరగనున్న వేళ ఇలాంటి ప్రకటనలు చేయడం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు అవుతుందని పేర్కొన్నాయి. ఇలాంటి ప్రకటన చేయాల్సిన అత్యవసర పరిస్థితులేవీ లేవని యూడీఎఫ్ కన్వీనర్ ఎంఎం హసన్ అన్నారు.
భాజపా కేరళ అధ్యక్షుడు కే సురేంద్రన్ సైతం దీనిపై ఫిర్యాదు చేశారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు సీఎం అలాంటి ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. ఇది ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు.
ఖండించిన ఎల్డీఎఫ్
అయితే విపక్షాల ఆరోపణలను అధికార ఎల్డీఎఫ్(వామపక్ష ప్రజాస్వామ్య కూటమి) ఖండించింది.
"యూడీఎఫ్ ఆరోపణలు పిల్ల చేష్టల్లాగా ఉన్నాయి. రాష్ట్రంలో కొవిడ్ చికిత్స ఉచితంగా అందిస్తున్నాం. చికిత్స గురించి వివరాలు చెప్పడంలో భాగంగానే కొవిడ్ టీకా ఉచితంగా ఇస్తామనని ఆయన(సీఎం) ప్రకటించారు."
-ఏ విజయరాఘవన్, యూడీఎఫ్ కన్వినర్
ప్రజలందరికీ ఉచితంగానే వ్యాక్సిన్ అందించనున్నట్టు కేరళ సీఎం పినరయి విజయన్ శనివారం ప్రకటించారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ కోసం ఛార్జీలు విధించే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని స్పష్టంచేశారు.
ఉచితంగా కరోనా టీకా పంపిణీ చేస్తామని ప్రకటించిన రాష్ట్రాల్లో కేరళ మూడోది. ఇప్పటికే తమిళనాడు సీఎం పళనిస్వామి, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తామని ప్రకటించారు.