భాజపా పార్లమెంటరీ పార్టీ భేటీలో ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పౌరసత్వ చట్ట సవరణ బిల్లుపై ఆయా పార్టీ సభ్యుల మాటతీరు.. పాకిస్థాన్ భాషను తలపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పౌరసత్వ సవరణ చట్టం.. చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖితమవుతుందని వ్యాఖ్యానించారు మోదీ.
పౌరసత్వ బిల్లును.. కశ్మీర్‌కు ప్రత్యేక అధికారులు కల్పించే అధికరణ 370 రద్దుతో పోల్చారు ప్రధాని. పొరుగుదేశాల్లో మతపరమైన వేధింపులకు గురయ్యే మైనార్టీలకు ఈ బిల్లు శాశ్వత ఉపశమనం కల్పిస్తుందని స్పష్టం చేశారు.
బడ్జెట్‌పై సలహాలు కోరండి...
2020 వార్షిక బడ్జెట్ తదితర అంశాలపైనా పార్టీ ఎంపీలతో సమావేశంలో చర్చించారు మోదీ. రైతులు, వ్యాపారులు సహా అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని బడ్జెట్ రూపకల్పన చేయాలని పేర్కొన్నారు. ఎంపీలందరూ ఈ బాధ్యతలు తీసుకొని.. ఆర్థిక మంత్రికి ప్రజల సూచనలు, సలహాలను చేరవేయాలని నిర్దేశించారు.