ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్.. నలుగురు నక్సల్స్ మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్నంద్గాంవ్ జిల్లా పర్ధోనీ గ్రామంలో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో నలుగురు నక్సలైట్లు మృతి చెందారు. మృతుల్లో మహిళా మావోయిస్టు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కాల్పుల్లో ఓ ఎస్సై కూడా ప్రాణాలు కోల్పోయారు. నక్సల్స్ నుంచి ఏకే-47, ఎస్ఎల్ఆర్ రైఫిళ్లు, రెండు 315 బోర్ రైఫిళ్లు స్వాధీనం చేసుకున్నారు.
పర్ధోనీ గ్రామంలోకి మావోయిస్టులు ప్రవేశించారన్న సమాచారంతో నిర్బంధ తనిఖీలు చేపట్టాయి భద్రతా దళాలు. గస్తీ బృందాలు మన్పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి ప్రవేశించగానే.. నక్సల్స్ బయటకువచ్చారు. ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి.
ఈ ఘటనలో మదన్‌వాడా పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా ఉన్న ఎస్సై ఎస్కే శర్మ ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. ఇతర భద్రతా సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. నక్సల్స్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.