దేశంలో అత్యవసర పరిస్థితి విధించి నేటితో 45 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఘాటు విమర్శలు చేశారు. ఒక్క కుటుంబ పదవీకాంక్ష దేశంలో అత్యవసర పరిస్థితికి దారి తీసిందని పరోక్షంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.
" దేశాన్ని రాత్రికి రాత్రే జైలుగా మార్చేశారు. ప్రసార మాధ్యమాలు, భావ ప్రకటనా స్వేచ్ఛ, న్యాయస్థానాలను అణిచివేశారు. పేదలు, అణగారిన వర్గాలపై దారుణాలకు పాల్పడ్డారు. దేశ ప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాల కంటే ఒక కుటుంబ ప్రయోజనాలే ఎక్కువయ్యాయి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో వాస్తవాలను మాట్లాడిన నేతల నోరుమూయించి, వారిని పదవుల నుంచి తొలగించారు. కాంగ్రెస్‌లో నేతలు ఎవరూ ఇమడలేకపోతున్నారు."
- అమిత్ షా, కేంద్ర హోంమంత్రి
అత్యవసర పరిస్థితి భావజాలం కల్గిన నేతలు ఎందుకు అవసరమో కాంగ్రెస్ పార్టీ నేతలు తమను తాము ప్రశ్నించుకోవాలని ఈ సందర్భంగా సూచించారు షా. కాంగ్రెస్‌లో నేతలు ఎందుకు అసంతృప్తితో ఉన్నారో, ఒక కుటుంబ వ్యక్తులకు తప్ప ఇతరులకు నోరు విప్పే అవకాశం ఎందుకు రావడం లేదో పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు.
ఇదీ చూడండి: కరోనా రికార్డ్: కొత్తగా 16,922 కేసులు, 418 మరణాలు