ఎనిమిదంటే ఎనిమిదేళ్లు.. ఈ వయసులో ఎవరైనా ఆటపాటలతో కాలక్షేపం చేస్తారు. అయితే ఓ చిన్నారి.. ఏకంగా రామాయణ ఇతిహాసాన్నే రాసేసింది. ఈ పురాణేతిహాసాన్ని లిఖించడానికి మహామహులే నెలల తరబడి సమయాన్ని వెచ్చిస్తారు. అయితే ఒడిశాకు చెందిన ఇషితా ఆచారి మాత్రం 22 రోజుల్లోనే పూర్తి చేసి ఔరా! అనిపించుకుంది.
ఒడిశాలోని బెర్హంపుర్కు చెందిన ఇషితా.. తన తల్లిదండ్రులతోపాటు తమిళనాడులోని చెన్నైలో నివాసముంటోంది. లాక్డౌన్ కాలంలో రామాయణమనే ఐకానిక్ టెలీ సీరియల్ చూసిన ఈ చిన్నారి.. ఆ గ్రంథాన్నే రాసేందుకు పూనుకుంది. తక్కువ కాలంలోనే రామాయాణాన్ని రాసిన అతిపిన్న వయస్కురాలిగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్-2020 అవార్డు అందుకుంది.
టీవీలో ప్రసారమయ్యే రామాయణం నాటిక చూశాక.. ఎలాగైనా ఈ పుస్తకాన్ని రాయాలనుకున్నట్లు చెప్పింది ఇషితా.
'రామాయణం చూశాక.. ఈ పవిత్ర గ్రంథాన్ని రాయాలనిపించింది. మే నెలలో లిఖించడం ప్రారంభించాను. 22 రోజుల్లో మొత్తం రామాయాణాన్ని కుదించి 57 పేజీల్లో పూర్తిచేశాను.'
- ఇషితా ఆచారి
ఇదీ చదవండి: దర్శకుడు రాజమౌళి.. 'రామాయణం' తీయాలి!