పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా అసోంలో జరుగుతున్న ఆందోళనలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. హింసను సృష్టించే వారిని వదిలేదే లేదని హెచ్చరించారు. ఈ మేరకు ప్రత్యేక దర్యాప్తు(సిట్) బృందాన్ని ఏర్పాటు చేశామని వెల్లడించారు. వదంతులు నమ్మి నిరసనల్లో పాల్గొనవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. అసోం రాష్ట్రం ఎప్పటికీ అస్సామీలతోనే ఉంటుందని హామీ ఇచ్చారు.
అందుకోసం అవసరమైన ఎలాంటి చట్టాన్ని తీసుకురావడానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. అస్సాం ఒప్పందంలోని క్లాజ్-6 పటిష్ఠ అమలుకు చర్యలు తీసుకుంటామని ప్రధానమంత్రి మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారని వెల్లడించారు.
క్లాజ్ 6 ఏం చెబుతోంది..?
అస్సాం ఒప్పందంలో 6వ క్లాజ్‌ను సీఏఏ సవాల్ చేస్తోందనేది ఆందోళనకారుల వాదన. ‘‘అస్సామీ ప్రజల సాంస్కృతిక, సామాజిక, భాషా, వారసత్వాన్ని సంరక్షించడానికి, ప్రోత్సహించడానికి తగిన విధంగా రాజ్యాంగ, శాసన, పాలనాపరమైన భద్రత కల్పించే బాధ్యత కేంద్రానిదే’’ అని క్లాజ్-6 చెబుతోంది. అయితే తాజా చట్టంలో దీనికి సంబంధించిన ప్రస్తావన ఎక్కడా లేదని ఆందోళనకారులు చెబుతున్నారు. దీనివల్ల తమ సంస్కృతి, భాష తద్వారా అస్సామీల ఉనికికి తీవ్ర విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి : శరణార్థులను ఆదుకోవడానికే 'పౌర' చట్టం: కిషన్‌రెడ్డి