'ఆయుష్మాన్ భారత్' పథకం ద్వారా లబ్ధి పొందినవారి సంఖ్య ఒక కోటి దాటిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. మేఘాలయకు చెందిన పూజా థాపా అనే ఓ లబ్ధిదారినితో ఫోన్లో మాట్లాడుతూ ఆయన ఈ గణాంకాలు వెల్లడించారు.
"ఆయుష్మాన్ భారత్ లబ్ధిదారుల సంఖ్య ఒక కోటి దాటింది. ఇది ప్రతి భారతీయుడు గర్వపడే విషయం. కేవలం రెండేళ్లలోనే ఈ పథకం అనేక మంది జీవితాలపై సానుకూల ప్రభావాన్ని చూపింది."
- ప్రధాని మోదీ ట్వీట్
2018 సెప్టెంబర్‌లో మోదీ... 'ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన- ఆయుష్మాన్ భారత్'ను ప్రారంభించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ ప్రాయోజిక ఆరోగ్య సంరక్షణ పథకం.
విశ్వాసాన్ని సాధించింది...
ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా రోగులకు సేవలందిస్తున్న వైద్యులు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలకు మోదీ అభినందనలు తెలిపారు. వారి కృషితోనే... ప్రపంచంలోని అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని ప్రశంసించారు. ఈ బృహత్ ఆరోగ్య సంరక్షణ పథకం భారతీయుల విశ్వాసాన్ని గెలుచుకుందని ఆయన వ్యాఖ్యానించారు.
"ఈ పథకం వల్ల ముఖ్యంగా పేదలు, అణగారిన వర్గాలు ప్రయోజనం పొందుతున్నారు. ఇందులోని పోర్టబిలిటీ సౌకర్యం అత్యంత ప్రయోజనకరమైనది. దీని వల్ల లబ్ధిదారులు వారు నమోదు చేసుకున్న చోటనే కాకుండా... దేశంలో ఎక్కడైనా తక్కువ ఖర్చుతో, నాణ్యమైన వైద్య సేవలు పొందవచ్చు. దీని వల్ల ఇంటికి దూరంగా ఇతర ప్రాంతాల్లో పనిచేసేవారికి చాలా ప్రయోజనం కలుగుతుంది."
- ప్రధాని మోదీ
కార్డు లేకుండా ఎలా?
ఇకపై అధికారిక పర్యటనల సందర్భంగా ఆయుష్మాన్ భారత్ లబ్ధిదారులతో స్వయంగా మాట్లాడతానని మోదీ చెప్పారు.
మేఘాలయలోని ఓ సైనికుని భార్య పూజా థాపాతో మోదీ స్వయంగా టెలిఫోన్లో మాట్లాడారు. ఆమె భర్త మణిపుర్లో సైనిక విధులు నిర్వహిస్తున్నారు. లాక్డౌన్ వల్ల ఆయన అక్కడే ఉండాల్సిన పరిస్థితి. దీనితో ఆమె తన ఇద్దరు చిన్న పిల్లలను పక్కింటివారికి అప్పగించి, షిల్లాంగ్‌లోని ఓ ఆసుపత్రిలో చేరారు. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా పూర్తి ఉచితంగా శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ పథకం లేకపోతే తాను ఆపరేషన్ చేయించుకునేందుకు అప్పు చేయాల్సి వచ్చేదని చెప్పారు పూజ.
ఇదీ చూడండి: కరోనా రికార్డ్: 24 గంటల్లో 5,611 కేసులు, 140 మరణాలు