కేరళలోని కోజికోడ్‌కు చెందిన సంతోష్ కుమార్ చేపలు విక్రయించడానికి ఓ వినూత్న పద్ధతిని ప్రారంభించారు. ఆయనే స్వయంగా చేపలను పెంచుతూ.. వినియోగదారులకు వాటిని పట్టే అవకాశం కూడా కల్పిస్తున్నారు. వినియోగదారులు కొలను దగ్గరకు వెళ్లి కావల్సినవి, నచ్చిన చేపలను స్వయంగా పట్టుకోవచ్చు. దీనికి పెద్దలతో పాటు పిల్లలు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. పెద్ద మొత్తంలో చేపలు కావాలనే వారికి వలలు, చిన్న మొత్తంలో కావాలనుకునే వారికి గాలాలను సమకూర్చుతున్నారు సంతోష్ కుమార్.
కొలను ఏర్పాటు
లక్షా 60 వేల రూపాయల వ్యయంతో సంతోష్ పావన్‌గడ్‌లోని తన నివాసంలో ఈ చేపల కొలనును ఏర్పాటు చేశారు. 25మీటర్ల పొడవు, 13 మీటర్ల వెడల్పు, 2 అడుగుల లోతున్నఈ కొలనులో దాదాపు 4 వేల చేపలు పెంచుతున్నారు.
ఈ జాతులు అందిస్తున్నారు
ప్రస్తుతం అస్సాం వాలా, తిలపియా రకాల చేపలను అందిస్తున్నారు సంతోష్ కుమార్. త్వరలోనే కడ్లా, రోహు జాతుల చేపలను అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ చేపలకు దాణా కింద తరగగా మిగిలిన కూరగాయలను, ఓజోలా, పౌల్ట్రీ వస్తువులను అందిస్తున్నారు. మిగిలిన సాగుల కన్నా ఈ తరహా చేపల పెంపకం ఎంతో సులువుగా ఉందంటున్నారు సంతోష్ కుమార్.
సమయం
సెలవు రోజుల్లో ఎప్పుడైనా ఇక్కడ చేపలను పట్టుకునేందుకు వీలు కల్పిస్తారు. పని దినాల్లో మాత్రం ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు మాత్రమే అవకాశం ఉంటుంది. మార్కెట్ ధరలోనే ఈ తాజా చేపలు లభిస్తుండడం మరో విశేషం.
ఇదీ చూడండి : సౌర శక్తితో నడిచే స్కూటర్.. గంటకు 49 కిలోమీటర్ల వేగం!