ETV Bharat / bharat

ఆగని ఆకలి కేకలు.. భారతావనికేదీ పౌష్టికాహారం? - World Hunger Index-2019 india news

గత మూడు దశాబ్దాల్లో వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా పెరిగినా.. దేశంలో ఆకలి కేకలు ఆగడం లేదు. మొత్తం 117 దేశాల నుంచి సేకరించిన సమాచారంతో రూపొందించిన ప్రపంచ ఆకలి సూచీ-2019లో భారత్‌ 102వ స్థానంలో నిలవడం దేశ దుస్థితికి అద్దం పడుతోంది. దేశంలో దాదాపు 19 కోట్ల మంది పౌష్టికాహార సమస్యలతో బాధపడుతున్నారు. చనిపోతున్న అయిదేళ్లలోపు పిల్లల్లో 69శాతం సరైన పౌష్టికాహారం లోపంతో చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది.

Not everyone in India has access to nutritional value
అందరికీ అందని పోషక విలువలు
author img

By

Published : Oct 23, 2020, 10:50 AM IST

ప్రజలు ఏ మేరకు పోషక విలువలున్న ఆహారం తీసుకుంటున్నారన్నది కూడా ఒక దేశ ఆర్థిక పరిస్థితికి సంకేతంలా నిలుస్తుంది. భారత్‌లో గత మూడు దశాబ్దాల్లో ప్రజల ఆర్థిక స్థితిగతుల్లో వచ్చిన మార్పులు ఆహార అలవాట్లను మార్చివేశాయి. వ్యవసాయ ఉత్పత్తులూ గణనీయంగా పెరిగాయి. అయినా ఇప్పటికీ దేశంలో 15శాతం జనాభాకు ఆకలి బాధలు తప్పడంలేదు. మొత్తం 117 దేశాల నుంచి సేకరించిన సమాచారంతో రూపొందించిన ప్రపంచ ఆకలి సూచీ-2019లో భారత్‌ది 102వ స్థానం. దేశంలో దాదాపు 19 కోట్ల మంది పౌష్టికాహార సమస్యలతో బాధపడుతున్నారు. ఇందులో 15 నుంచి 49 ఏళ్లలోపు వయసున్న మహిళల్లో 51శాతం అత్యంత బలహీనంగా ఉంటున్నారని ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) నివేదిక పేర్కొంది. చాలామంది రక్తహీనత సమస్యలు ఎదుర్కొంటున్నారు. 2019లో చిన్నారుల స్థితిపై యునిసెఫ్‌ నివేదిక ప్రకారం చనిపోతున్న అయిదేళ్లలోపు పిల్లల్లో 69శాతం సరైన పౌష్టికాహారం లభించక ప్రాణాలు విడుస్తున్నారు.

2018 ప్రపంచ పోషణ నివేదిక మేరకు 4.66 కోట్ల మంది పిల్లలు వారి వయసుకు తగ్గ ఎత్తు పెరగడం లేదు. 2.56 కోట్ల మంది చిన్నారులు ఎత్తుకు తగిన బరువు ఉండటం లేదు. దేశ ప్రజలకు సంపూర్ణ పౌష్టికాహార లభ్యత ఇప్పట్లో సాధ్యమేనా అన్న ప్రశ్నకు సమాధానం లభించడం కష్టమే. అత్యధికులు సమతులాహారానికి దూరంగా ఉండిపోతున్నారు. జాతీయ పోషణ సంస్థ (ఎన్‌ఐఎన్‌) ఇటీవల విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని ధ్రువీకరించింది.

పిండిపదార్థాల వినియోగమే అధికం

దేశంలో అత్యధికుల ఆహారంలో పిండిపదార్థాల శాతమే ఎక్కువగా ఉంటోందని, మాంసకృత్తులు వంటి ఇతర పోషకాల శాతం చాలా పరిమితమేనని ఎన్‌ఐఎన్‌ తన నివేదికలో పేర్కొంది. ఒక వ్యక్తికి నిత్యం లభించాల్సిన శక్తిలో 45శాతం మేర మాత్రమే పిండిపదార్థాల ద్వారా అందాలి. మిగిలిన శక్తి మొత్తం ప్రొటీన్లు తదితర పోషకాల ద్వారా లభించాలి. అంటే ధాన్యం, పప్పు దినుసులు, పాలు, కూరగాయలు, మాంసాహారం వంటి వాటన్నింటి ద్వారా మనిషికి కావాల్సిన శక్తి లభించాలి.

గ్రామీణుల్లో 65శాతం శక్తి కేవలం పిండిపదార్థాల రూపంలోనే వస్తోంది. పట్టణ ప్రాంతాల్లో ఉండే వారికీ ఆహారం ద్వారా లభించే శక్తిలో 51శాతం పిండిపదార్థాల ద్వారానే లభిస్తుండటం గమనార్హం. మాంసకృత్తుల ద్వారా 17శాతం శక్తి పొందాల్సి ఉండగా, సగటున 11శాతం మాత్రమే లభిస్తున్నట్లు ఎన్‌ఐఎన్‌ అధ్యయనంలో వెల్లడైంది. పోషకాహార అసమతౌల్యం మధుమేహం, రక్తపోటు వంటి అనారోగ్య సమస్యలకూ కారణమవుతోంది. దేశంలో పాలు, కూరగాయలు, మాంసం ఉత్పత్తులు గణనీయంగా పెరుగుతున్నా- వాటి వినియోగం తక్కువగా ఉంటోంది. ఒక వ్యక్తి నిత్యం తీసుకునే ఆహారంలో 300 గ్రాముల కూరగాయలు ఉండాలని పోషకాహార నిపుణులు చెబుతారు. దేశంలో ప్రస్తుతం సుమారు 18.5 కోట్ల టన్నుల కూరగాయలు ఏటా ఉత్పత్తి అవుతున్నాయి. ఇప్పటికీ పట్టణ ప్రాంతాల్లో ఉంటున్న వారిలో 17శాతం, గ్రామీణుల్లో తొమ్మిది శాతం మాత్రమే నిత్యం అవసరమైన మేరకు కూరగాయలు తింటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

దేశంలో సుమారు 19 కోట్ల టన్నుల పాలు ఉత్పత్తి అవుతున్నాయని అంచనా. వీటిని తగిన మోతాదులో తీసుకుంటున్నవారు గ్రామీణ ప్రాంతాల్లో 8.7శాతం; పట్టణ ప్రాంతాల్లో ఉండే వారిలో దాదాపు 15శాతం మాత్రమే. పండ్లు, మాంసం, ఎండు ఫలాలు లాంటివీ పరిమితంగానే తీసుకుంటున్నారు. సమతుల ఆహారాన్ని తీసుకోకపోవడానికి అవగాహన లోపం కొంతవరకూ కారణమైతే ఆర్థిక ఇబ్బందులే ప్రధాన సమస్య. ప్రజలు పోషకాహారం వైపు మళ్లితే ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ కలిపి వైద్యంపై వెచ్చించే ఖర్చు దాదాపు 97శాతం మేర తగ్గుతుందని ప్రపంచ బ్యాంకు ఒక నివేదికలో పేర్కొనడం గమనార్హం.

ఆకలి కోరల్లో పేదలు

కరోనా విజృంభించిన నేపథ్యంలో ప్రజల్లో పౌష్టికాహార అవసరంపై అవగాహన అనూహ్యంగా పెరిగింది. మహమ్మారి విసిరిన సవాలు కారణంగా, ప్రజల ఆదాయాలు మరింత తగ్గి 2021 నాటికి ప్రపంచంలో అదనంగా మరో 15 కోట్ల మంది పేదరిక జాబితాలో చేరవచ్చని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. అదనంగా మరో 13 కోట్ల మంది ఆకలి కోరల్లో చిక్కే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ ప్రభావం దేశ ప్రజలపైనా ఉంటుంది. అందుకని ప్రజలకు తగిన పౌష్టికాహారం అందించేలా చర్యలు తీసుకోవాలి. కూరగాయలు, పాల ఉత్పత్తికి మరింత ప్రోత్సాహం లభించాలి. రైతులకు రాయితీపై విత్తనాలు, బిందు, తుంపర ఉపకరణాలు, వ్యవసాయ పరికరాలను అందిస్తే- రైతులు కూరగాయల సాగుపై దృష్టిపెడతారు.

ఇటీవల పెరటి తోటలు, మిద్దె పంటల సాగు సంస్కృతి పెరుగుతోంది. ఇలాంటివాటిని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పోషక విలువలు ఉండే ఆహారాన్ని అందించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు అందించే మధ్యాహ్న భోజన పథకాన్ని, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలకు అందించే పౌష్టికాహార పథకాలను పటిష్ఠపరచే చర్యలు తీసుకోవాలి. ఈ తరహాలో పకడ్బందీ కార్యాచరణతో ముందుకు సాగితేనే ప్రజలకు పౌష్టికాహారం లభించి ఆరోగ్యవంతమైన భారత్‌ వర్ధిల్లుతుంది.

- కె.శివరాం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.