మధ్యప్రదేశ్‌లో భారీ వర్షాలకు నదులు ఉప్పొంగుతున్నాయి. హోషంగాబాద్, బెతుల్, జబల్‌పూర్, నర్సింగాపూర్, సియోనీ, హర్దా జిల్లాలు సహా.. అనేక ప్రాంతాలను వర్షాలు ముంచెత్తాయి. భారీగా వరద చేరడంతో అనేక డ్యామ్‌లు జలకళను సంతరించుకున్నాయి.
ఎడతేరిపిలేని వర్షాలకు భోపాల్, ఇండోర్‌లో.. పలు ప్రాంతాలు నీట మునిగాయి. భోపాల్ జిల్లాలో వరదలో చిక్కుకున్న 85మందిని.. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కాపాడారు.
ఆగకుండా కురుస్తున్న వర్షాలకు.. ఉజ్జయిని తడిసిముద్దయింది. వీధులు జలమయమయ్యాయి. పలు వాహనాలు కొట్టుకుపోయాయి. క్షిప్రా నదికి.. వరద పోటెత్తింది. క్షిప్రా నదీ తీరంలో ఉండే రామ్‌ఘాట్ వద్ద వరద మహోగ్రంగా ప్రవహిస్తోంది. రామ్‌ఘాట్ వద్ద ఆలయాలు నీట మునిగాయి. షెహోర్ జిల్లాలో రాత్రి నుంచి వర్షాలు పడుతున్నాయి. వరద నీటితో షెహోర్ నగరంలో వీధులు నదులను తలపిస్తున్నాయి. హోషంగా బాద్ జిల్లాలో ఉన్న తవా డ్యామ్‌కు భారీగా వరద నీరు చేరడంతో ఐదు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.
ఎడతెరిపిలేని వర్షానికి భోపాల్‌లోనూ వీధులు.. కాలువలను తలపించాయి. భోపాల్ సమీపంలోని భద్‌భదా డ్యామ్ నిండగా.. ఒక గేటు ఎత్తి నీటిని వదులుతున్నారు. మల్వా ప్రాంతంలోని షాజాపూర్‌లో కుండపోతకు.. నగరం నీట మునిగింది. వీధుల్లో వరద ప్రవాహంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇదీ చదవండి: వరద వలలో చిక్కుకున్న 74 లక్షల బతుకులు!