జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ 370 రద్దు నిర్ణయానికి ప్రపంచం మొత్తం మద్దతు పలికిందని పేర్కొన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. రానున్న 5-7 సంవత్సరాల్లో కశ్మీర్ అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతంగా రూపుదిద్దుకుంటుందన్నారు.
దిల్లీలోని ఇంద్రప్రస్తా విశ్వ సంవాద్ కేంద్రంలో 'జాతీయ భద్రత, రక్షణపై ప్రస్తుత దృష్టికోణం' పేరిట జరిగిన సదస్సులో పాల్గొన్నారు షా. కశ్మీర్ లోయలో ఆంక్షలు కొనసాగుతున్నాయని విపక్షాలు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 196 పోలీస్ స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ ఎత్తివేసినట్లు తెలిపారు.
"అధికరణ 370, కశ్మీర్ విషయంలో నేటికి చాలా వదంతులు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఈ అంశంపై కశ్మీర్ ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. 1947 నుంచి కశ్మీర్‌పై వివాదం, చర్చ జరుగుతోందని మనకు తెలుసు. వక్రీకరించిన చరిత్ర ప్రజల ముందు ప్రదర్శించారు. కశ్మీర్ చరిత్రను రాసే బాధ్యత తప్పులు చేసిన వారి చేతిలోనే ఉంది. దాని ఫలితంగానే నిజాలు కనుమరుగయ్యాయి. ప్రజల ముందు నిజమైన చరిత్రను ఉంచాల్సిన సమయం ఆసన్నమైంది."
- అమిత్ షా, కేంద్ర హోంమంత్రి.
జమ్ముకశ్మీర్‌లో దశాబ్దాల నాటి ఉగ్రవాదంతో 41,800 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోతే మానవ హక్కుల ఉల్లంఘనల గురించి ఎవరూ మాట్లాడలేదని మండిపడ్డారు షా. కానీ కొన్ని రోజులుగా సమాచార వ్యవస్థపై ఆంక్షలకు సంబంధించి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మొబైల్ కనెక్షన్లు లేకపోవటం మానవ హక్కుల ఉల్లంఘన కిందకు రాదని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: 'భారత్‌ను అస్థిర పరిచేందుకు పాక్ కుట్రలు'